కంటేశ్వర్ ( నిజామాబాద్ ) : నగర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్ పూర్తిగా సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుంది. డివిజన్ ను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. శుక్రవారం కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్ మహిళలు మంచినీటి (Drinking water) కోసం రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో బోధన్, నిజామాబాద్ (Nizamabad) ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా ( Dharna ) నిర్వహించారు.
గత మూడు నెలలుగా తాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులూ పడుతున్నామని, సమస్యను పరిష్కరించాలని కార్పొరేషన్ అధికారులకు మొర పెట్టుకున్నా పట్టించుకోవడంలేదని ప్రజావాణీలో సైతం ప్రజలు ఫిర్యాదు చేశారు. మహిళలు మాట్లాడుతూ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే కాలనీని సందర్శించి తాగునీటి సమస్య, మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్త, చెదారం, భరించలేని దుర్వాసన వెదజల్లి అనారోగ్యబారిన పడుతున్నమని ఆందోళన వ్యక్తం చేశారు.
డివిజన్లో రెండు చిన్న వాటర్ ట్యాంకులు ఉన్నా నిరుపయోగంగా ఉన్నాయని మహిళలు గంగామణి, పల్లెపు నీల పేర్కొన్నారు. బోరు మోటార్లు కాలిపోయినా పట్టించుకునే నాథుడే లేడని వెల్లడించారు. రాజకీయ నాయకులకు ఎన్నికల్లో మాత్రమే తాము గుర్తుకొస్తామని, ఈసారి ఎన్నికల్లో ఎవరైనా ఓటు అడగడానికి వస్తే వారికి తగిన గుణపాఠం చెప్తామని సాయమ్మ, దేవమ్మ అనే మహిళలు హెచ్చరించారు. రాస్తారోకో వల్ల ఇరువైపులా వాహనాలు నిలిచిపోయిన కారణంగా ట్రాఫిక్ స్తంభించి రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.