ఖలీల్‌వాడి, ఫిబ్రవరి 22: నిజామాబాద్ నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం నిర్వహించిన బడ్జెట్ సమావేశం గందరగోళంగా మారింది. నగర మేయర్ దండు నీతూకిరణ్ అధ్యక్షతన గురువారం బడ్జెట్ సమావేశం నిర్వహించగా.. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు హాజరయ్యారు. రూ. 274 కోట్లతో అంచనా బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా పాలకవర్గ సభ్యులు ఆమోదం తెలిపారు.
అయితే బడ్జెట్ సమావేశానికి మీడియాకు అనుమత్వికపోవడంపై బీజేపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తం గా మీడియాను అనుమతిస్తుంటే నిజామాబాద్‌లో ఎందుకు అనుమతివ్వడంలేదని వారు ప్రశ్నించారు. మీడియాకు అనుమతి విషయంలో అవసరమైతే ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీంతో కొద్దిసేపు సమావేశంలో గందరగోళం నెలకొంది. గత పాలకుల నిర్లక్ష్యంతోనే కార్పొరేషన్‌కు నిధులు రాలేదని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా నగరమేయర్ నీతూ కిరణ్ మాట్లాడుతూ.. 2024-25 సంవత్సరానికి సుమారు రూ. 274 కోట్లతో అంచనా బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
మున్సిపల్ ఆదా యం రూ. 90 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల ద్వారా రూ. 177 కోట్ల నిధులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. నగర అభివృద్ధి, నిధుల సమీకరణకు సహకరించాలని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని కోరారు.మున్సిపల్ ఆదా యం నుంచి మౌలిక సదుపాయాల కోసం కేటాయించినట్లు చెప్పారు. అనంతరం పలువురు కార్పొరేటర్లు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానమిచ్చారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ ఇద్రిస్‌ఖాన్, కమిషనర్ మకరంద్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ మెంబర్లు, అధికారులు పాల్గొన్నారు.