వినాయక్‌నగర్, ఫిబ్రవరి 18: ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలను హతమార్చిన కేసులో నిందితులైన మాక్లూర్ మండలానికి చెందిన తల్లీకొడుకుకు జీవితఖైదు విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించినట్లు నిజామాబాద్ ఇన్చార్జి సీపీ సింధూశర్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మాక్లూర్ మండలానికి చెందిన పూన ప్రసాద్, భార్య రమణి, కవలలైన వారి పిల్లలు (చైత్రిక, చైత్రిక్), ఇద్దరు చెల్లెళ్లు శ్రావణి, స్వప్నను ఆస్తికోసం తల్లీ కొడుకులైన మేడిద ప్రశాంత్, మేడిద ఒడ్డెమ్మ హత్యచేశారు. అద్దెకు తెచ్చుకున్న కారులో వారి మృతదేహాలను వివిధ ప్రాంతాల్లో పడేశారు.
ఆరుగురిలో కవల పిల్లలైన చైత్రిక, చైత్రిక్ మృతదేహాలను ప్లాస్టిక్ సంచుల్లో మూటకట్టి మెండోరా మండల పరిధిలోని దూదిగాం గ్రామ శివారులో ఉన్న గోదావరి నదిలో పడవేశారు. కవల పిల్లల హత్య ఘటనపై 2023 డిసెంబర్ 4న మెండోరా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆర్మూర్ రూరల్ సీఐ బి.గోవర్ధన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి దర్యాప్తు చేపట్టి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణ అనంతరం నిందితులు మేడిద ప్రశాంత్, మేడిద ఒడ్డెమ్మ (ప్రశాంత్ తల్లి)కు నిజామాబాద్ జిల్లా జడ్జి సునీత కుంచాల జీవిత ఖైదు విధించారని అదనపు సీపీ (అడ్మిన్)జి.బస్వారెడ్డి మంగళవారం వెల్లడించారు. మిగతా నాలుగు హత్య కేసులపై విచారణ వివిధ కోర్టుల్లో కొనసాగుతున్నదని పేర్కొన్నారు.