కంఠేశ్వర్ : నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసన మండలి ( Council ) ఎన్నికలకు సంబంధించి ఈ నెల 27న చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ( Collector Rajiv Gandi Hanmanth) సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, శిక్షణ తరగతుల్లో ( Traning Centres) మాస్టర్ ట్రైనర్లను అడిగి నివృత్తి చేసుకోవాలని అన్నారు.
నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రిసైడింగ్ అధికారులు , సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓ.పీ.ఓలకు జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్ భవన్ లో శనివారం మొదటి విడత శిక్షణ తరగతులను నిర్వహించారు. శిక్షణ తరగతుల్లో ఎన్నికల విధులకు సంబంధించిన అన్ని అంశాలపై అవగాహన ఏర్పర్చుకోవాలని అన్నారు. ప్రధానంగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే, శాసన మండలి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొంత భిన్నంగా ఉంటుందన్నారు.
బ్యాలెట్ పద్ధతిన జరిగే ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియలో ఓటింగ్ నిర్వహణకు ఒకింత ఎక్కువ వ్యవధి పట్టే అవకాశాలు ఉన్నందున ఓపిగ్గా, సంయమనంతో వ్యవరిస్తూ సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. ఈనెల 27వ తేదీన ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు పోలింగ్ (Polling) సమయం ఉంటుందని, గడువు లోపు పోలింగ్ కేంద్రం పరిధిలో క్యూ లైన్ లో ఉన్న వారికి వరుస క్రమంలో టోకెన్ నెంబర్లు అందించి ఓటింగ్ జరిపించాలన్నారు.
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తూ బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా పోలింగ్ ప్రక్రియను జరిపించాలన్నారు. పోలింగ్ కేంద్రాల లోనికి సెల్ ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. డిస్ట్రిబ్యూషన్ రోజు బ్యాలెట్ బాక్సులు తీసుకొని, పోలింగ్ ప్రక్రియ ముగిసిన మీదట వాటిని కరీంనగర్ లోని రిసెప్షన్ సెంటర్ లో అప్పగించాల్సిన బాధ్యత ప్రిసైడింగ్ అధికారులదేనని స్పష్టం చేశారు.
ఓటర్లు, అభ్యర్థుల ఏజెంట్లు వివిధ అంశాలపై సందేహాలను లేవనెత్తే అవకాశాలు ఉన్నందున వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత పి.ఓలదే అని అన్నారు. శిక్షణ తరగతుల్లో నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆయా మండలాల తహసీల్దార్లు, పీ.ఓలు, ఏ.పీ.ఓలు, ఓ.పీ.ఓలు పాల్గొన్నారు.