ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేని విధంగా యువతకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్‌లను ఇప్పించేందుకు ఆర్మూర్‌లో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. యువతీయువకుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 18 ఏండ్లు నిండిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించగా విశేష స్పందన వచ్చింది. మొత్తం 10వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.
-ఆర్మూర్, జూలై 17
ఆర్మూర్, జూలై 17: ద్విచక్ర వాహనం లేని ఇల్లు లేదు. కానీ చాలా మంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాహనాలతో రోడ్లపైకి వస్తున్నారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపే వారికి రోడ్డు భద్రతపై అవగాహన తక్కువగా ఉండడంతో ప్రమాదాల బారినపడే అవకాశం ఉన్నది. లైసెన్స్ లేకుండా వాహనం నడిపి ప్రమాదానికి గురైతే ఇన్సూరెన్స్ సైతం వర్తించదు. ఈ నేపథ్యంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి 18ఏండ్లు నిండిన వారికి ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆర్మూర్ నియోజకవర్గంలో లైసెన్స్ లేని యువతీయువకులు ఉండకూడదనే సంకల్పంతో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఉచితంగా డ్రైవిం గ్ లైసెన్స్ మేళాను నిర్వహించారు. ఆరు రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ చేపట్టగా నియోజకవర్గంలోని యువత నుంచి విశేష స్పందన వచ్చింది. ఆర్మూర్ పట్టణంతోపాటు మండలం, నందిపేట్, మాక్లూర్, ఆలూర్, డొంకేశ్వర్ మండలాల నుం చి పెద్ద సంఖ్యలో యువత ఉచిత డ్రైవింగ్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 10వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయ ప్రతినిధులు తెలిపారు.
ముందుగా లర్నింగ్..
ఉచిత డ్రైవింగ్ లైసెన్స్‌లకు దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యింది. మరో 15 రోజుల వ్యవధిలో దరఖాస్తులను ఆన్లైన్ చేసి రోజుకు 250 మందికి స్లాట్ బుక్ చేసి ముందుగా లర్నింగ్ లైసెన్స్‌లు ఇస్తామని, నెల రోజుల తర్వాత మళ్లీ ఆన్లైన్లో స్లాట్ బుక్‌చేసి ఒరిజినల్ లైసెన్స్ అందించనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయ పీఏ శ్రీకాంత్ తెలిపారు. టూ, ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్‌కు సుమారు రూ.3వేల నుంచి రూ.4 వేల వరకు ఖర్చు అవుతుండడంతో ఎమ్మె ల్యే జీవన్‌రెడ్డి ఉచితంగా లైసెన్స్‌లు అందించడంపై యువత హర్షం వ్యక్తంచేస్తున్నది.
ఎమ్మెల్యేది.. మంచి ఆలోచన
నేను ఆర్మూర్‌లోని ఓ మాల్లో పనిచేస్తాను. అరుంధతీనగర్ కాలనీ నుంచి మాల్‌కు రావడం ఇబ్బందిగా ఉండడంతో కొత్తగా స్కూటీ తీసుకున్నా. లైసెన్స్ సైతం తీసుకుందామని అనుకునేలోపే ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత లైసెన్స్ మేళా ఏర్పాటు చేశారు. క్యాంపు ఆఫీసుకు వచ్చి దరఖాస్తు చేసుకున్నాను ఇంత మంచి మేళా నిర్వహించిన జీవన్‌రెడ్డికి కృతజ్ఞతలు.
-రంజిత, అరుంధతీనగర్, ఆర్మూర్
అందరికీ అవసరం..
నా వయస్సు 25 ఏండ్లు. ఐదేండ్లుగా బైక్ నడుపుతున్నా. ఇప్పటి వరకు లైసెన్స్ తీసుకోలేదు. ప్రస్తుతం ఉచిత లైసెన్స్ మేళా పెట్టి లైసెన్స్ ఇస్తుండడంతో వచ్చి దరఖాస్తు చేసుకున్నాను. ఇది నిజంగా మంచి కార్యక్రమం. యువతీ యువకులకు ఎంతో మేలు చేకూరుతుంది.
-కొండూర్ రాజు, మారంపల్లి, నందిపేట్
చాలా గొప్ప కార్యక్రమం..
మా ఫ్రెండ్‌కు లైసెన్స్ లేదు. ఒకసారి బైక్‌పై వెళ్తుండగా పోలీసులు పట్టుకొని లైసెన్స్ లేకపోవడంతో బండి సీజ్ చేశా రు. ఆ తర్వాత కౌన్సిలిం గ్ ఇచ్చి వదిలిపెట్టారు. మా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడం అభినందనీయం.
-రాజ్‌కుమార్, రాజారాంనగర్ కాలనీ, ఆర్మూర్
ఎమ్మెల్యేకు థాంక్స్…
యువతకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇచ్చేందుకు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ముందుకు రావడం గొప్ప విషయం. నాకు లైసెన్స్ లేదు. ఉచిత లైసెన్స్ ఇస్తున్నారని తెలిసి వచ్చాను. దరఖాస్తు చేసుకున్నా. చాలా రోజులుగా లైసెన్స్ తీసుకోవాలని అనుకుంటున్నా.. వీలు కాలేదు. ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళాతో నా సమస్య తీరింది. మంచి కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి కృతజ్ఞతలు. -మండల రాజు, చేపూర్