నందిపేట్, డిసెంబర్ 2 : తన జీవితం ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకే అంకితమని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికలతో ప్రమేయం లేకుండా ప్రతిక్షణం అందుబాటులో ఉంటానన్నారు. నమస్తే నవనాథపురం కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని 33వ వార్డులో శుక్రవారం పర్యటించారు. అనంతరం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వార్డులో పర్యటించిన సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు అక్కడిక్కడే ఆదేశాలు జారీచేశారు. పట్టణంలోని ఒక్కో వార్డుకు పది ఇండ్ల చొప్పున మంజూరు చేస్తానని, సొంత స్థలాలు ఉన్న అర్హులను గుర్తించాలని కౌన్సిలర్లుకు సూచించారు. ఉదయం తన నివాసంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు, కార్యకర్తలతో పార్టీ కార్యక్రమాలపై చర్చించారు.
ఆర్మూర్ పట్టణంలో నిర్మించిన కేజీబీవీ నూతన భవనాన్ని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రారంభించారు. మున్నూరుకాపు ఫంక్షన్‌హాల్ కోసం మంజూరు చేసిన రూ. 50 లక్షల నిధులకు సంబంధించిన ప్రోసీడింగ్ కాపీని సంఘ ప్రతినిధులకు అందజేశారు. ఓ లబ్ధిదారుడికి మంజూరైన దళితబంధు యూనిట్‌ను పంపిణీ చేశారు. చేపూర్ గ్రామంలో కుమ్రం భీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేస్తున్న పట్టణ పరిధిలోనిగూండ్ల చెరువును ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సందర్శించి బోటింగ్ చేశారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఏడాదిపాటు నీటితో కళకళలాడే గూండ్ల చెరువు మధ్యలో ఐలాండ్ నిర్మాణం, పర్యాటకులకు బ్రేక్‌ఫాస్ట్ సౌకర్యాలు కల్పించడంతో పాటు వసతిగృహం నిర్మించాలని సూచించారు.
నందిపేట్ గ్రామానికి చెందిన వడ్డెర సంఘం సభ్యులు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినితా పవన్, వైస్‌చైర్మన్ షేక్ మున్నా, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యర్తలు ఉన్నారు.
అభివృద్ధిలో ఆర్మూర్ సూపర్ అని, కోట్లాది నిధులతో పట్టణాన్ని అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తెలిపారు. సిద్ధులగుట్ట ఘాట్ రోడ్డు, బైపాస్ రోడ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. కుల సంఘ భవన నిర్మాణాలకు స్థలాలు, నిధులు ఇచ్చామని గుర్తుచేశారు. రూ.10కోట్ల ఎస్డీఎఫ్తోపాటు సీడీఎఫ్ ద్వారా వచ్చిన రూ.50 కోట్లల్లో ఇప్పటికే రూ.27 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. రూ.23 కోట్లతో మిగతా పనులు చేపడుతామని చెప్పారు. వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణానికి రూ.6కోట్లు మంజూరు చేశామనిన్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతుల్లో 75 శాతం సమస్యలు ఇప్పటికే పరిష్కరించామని, ప్రతిపాదిత 375 పనులన్నీ ఈ నెల 15 లోగా ప్రారంభమవుతాయని తెలిపారు. వాటిని కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు అధికారులకు బాధ్యతలు అప్పగించామన్నారు. పట్టణానికి వంద పడకల దవాఖానను సాదించుకున్నామని, ఇక్కడ 22,670 ప్రసవాలు జరిగాయని, ఒక్కో తల్లికి రూ. 50 వేల రూపాయల చొప్పున ఖర్చు తప్పిందన్నారు. నవంబర్లోనే ఉచితంగా 310 ప్రసవాలు చేయడంతో ప్రజలకు రూ. కోటీ 50 లక్షల లబ్ధి చేకూరిందని తెలిపారు. వారంలోగా ఆర్మూర్‌లో డయాలసిస్ సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు.