భిక్కనూరు, ఆగస్టు 21: తనకు అన్ని అర్హతలు ఉన్నా పింఛన్ మంజూరు చేయడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తూ ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. ఈ ఘటన మండలంలోని కంచర్ల గ్రామంలో శుక్రవారం చోటుచేసుకున్నది. కంచర్ల గ్రామానికి చెందిన గొల్ల రాములు తనకు గతంలో పింఛన్ వచ్చేదని, ప్రస్తుతం అన్ని అర్హతలు ఉన్నా రావడంలేదని అధికారులు తీరును నిరసిస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కాడు.
సుమారు రెండు గంటలపాటు అక్కడే ఉండడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు రాములను సముదాయించి ట్యాంకు నుంచి కిందకు దించారు. రాములుకు సదరం సర్టిఫికెట్ లేకపోవడంతో పెన్షన్ మంజూరు కావడంలేదని, అతడు మూర్ఛవ్యాధితో బాధపడుతున్నాడని గ్రామస్తులు తెలిపారు. గతంలోనూ గ్రామసభ నిర్వహిస్తుండగా పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ రాములు జీపీ ఆవరణలో ఉన్న ఓ చెట్టు ఎక్కి నిరసన తెలిపాడని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు పింఛన్ మంజూరు చేయాలని రాములు కోరాడు.