వేల్పూర్, ఏప్రిల్ 14 : భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతిఒక్కరూ ముందుకు సాగాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో వేముల పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గొప్ప మేధావి, మానవతావాది బాబాసాహెబ్ అంబేద్కర్ అని పేర్కొన్నారు.
సమాజంలో ప్రజల మధ్య అంతరాలు, అసమానతలు లేకుండా అందరూ సమానంగా జీవించినప్పుడే వారికి మనం ఘనమైన నివాళిర్పించినట్లు అని తెలిపారు. అంబేద్కర్ సూచించిన సమీకరించు, బోధించు, పోరాడు అనే విధానాన్ని కేసీఆర్ ఆదర్శంగా తీసుకుని రాష్ర్టాన్ని సాధించారని అన్నారు. అంబేద్కర్ ఆనాడు కొత్త రాష్ర్టాలు ఏర్పడాలంటే బలమైన వారు ఎప్పుడు బలహీనులు వేరు పడుతామంటే ఒప్పుకోరని, రాష్ర్టాల ఏర్పాటు అసెంబ్లీ ద్వారా కాకుండా పార్లమెంటరీ ప్రక్రియ ద్వారానే ఏర్పడాలని ఆర్టికల్ 3 ని రాజ్యాంగంలో పొందుపర్చారని గుర్తు చేశారు.
125 అడుగుల విగ్రహాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలి
కేసీఆర్ సారథ్యంలో ప్రపంచంలోనే ఎత్తయిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో తాను భాగస్వామిఅయినట్లు తెలిపారు. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురాకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేస్తున్నదని, అలాగే అక్కడ జయంతి వేడుకలు కూడా నిర్వహించలేదన్నారు. రెండేండ్ల తర్వాత అంబేద్కర్ విగ్రహాన్ని పూలతో మొదటిసారి అలంకరించారని తెలిపారు. ప్రజలకు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దళిత విద్యార్థుల రీసెర్చ్ స్కాలర్స్తోపాటు పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం దళిత స్టడీ సెంటర్‌ను కూడా నిర్మించామని, కానీ ఇంతవరకు ప్రభుత్వం వినియోగంలోకి తీసుకురాలేదనని తెలిపారు. దీనిని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని వేముల డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ రమేశ్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు నీరడి భాగ్య, జమున, దళిత సంఘం నాయకులు దాసు, రాజారాం, ప్రభాకర్, దాసు, అంబేద్కర యూత్ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు.