రామారెడ్డి, జూలై 16: ఉమ్మడి జిల్లాలో కలకలం రేపిన పెద్దపులి జాడ ఇంకా దొరకలేదు. ఐదు రోజులుగా గాలిస్తున్నా ఫలితం కానరాలేదు. రామారెడ్డి మండలం రెడ్డిపేట్ స్కూల్ తండాలో పెద్దపులి దాడి చేసి ఆవును చంపేసిన సంగతి తెలిసిందే. దీంతో దాని ఆచూకీ కోసం అటవీ శాఖ చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నది. నాలుగు రేంజ్ల పరిధిలో పని చేస్తున్న 28 మంది సిబ్బంది బుధవారం అడవిని జల్లెడ పట్టారు.
ఈ క్రమంలో రామారెడ్డి మండలం రెడ్డిపేట స్కూల్ తండా అటవీ ప్రాంతంలో పెద్దపులి అడుగులు కనిపించాయని మాచారెడ్డి ఫారెస్ట్ రేంజ్ అధికారి దివ్య తెలిపారు. అయితే, ఆ పాద ముద్రలు గతంలోనివా.. లేక తాజావా? అన్నది కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. దీన్ని సైంటిఫిక్ ట్రాకర్స్ అధికారులు నిర్ధారణ చేసి చెబుతారని తెలిపారు.
పులి జాడ కోసం అటవీ ప్రాంతంలో పది ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని వివరించారు. గురువారం గాలింపు చర్యలు నిలిపి వేస్తున్నామని, పెద్దపులి స్వేచ్ఛగా సంచరిచండానికి అనుకూలమైన వాతావరణం ఉండడానికే ఈ ప్రయత్నమని పేర్కొన్నారు. చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరూ అడవిలోకి వెళ్లకూడదని అటవీ అధికారులు సూచించారు. అంతరించి పోతున్న పెద్దపులులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మన అటవీ ప్రాంతంలోకి వచ్చిన పెద్దపులిని సంరక్షించుకోవాల్సి ఉందని తెలిపారు.