భీమ్‌గల్/వేల్పూర్/మెండోరా/బాల్కొండ/ ముప్కాల్, జనవరి 4 : సీఎం కేసీఆర్ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా రాబోయే పది తరాలకు ప్రయోజనం చేకూరేలా ముందుచూపుతో నిర్ణయాలు తీసుకుంటారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని పలు మండలాల్లో మంత్రి బుధవారం విస్తృతంగా పర్యటించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భీమ్‌గల్ మండలం సికింద్రాపూర్‌లో రూ.8.40 కోట్ల నిధులతో అధునాతనంగా నిర్మించిన 10వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదామును ప్రారంభించారు.
మండలంలోని 120 మంది లబ్ధిదారులకు రూ. కోటీ 20 లక్షలకు పైగా విలువ చేసే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. చేంగల్ గ్రామంలో సుమారు రూ. 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న వేంకటేశ్వరస్వామి ఆలయ కల్యాణ మండపం, రూ. 20 లక్షల అంచనాతో నిర్మించనున్న హెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామం వరకు బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపనతోపాటు అమీనాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
మెండోరా మండలం పోచంపాడ్ గ్రామంలో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద మంజూరైన నిధులతో జడ్పీహెచ్ఎస్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బాల్కొండ మండల కేంద్రంలో ప్రముఖ వ్యాపార వేత్త ఏనుగు దయానంద్‌రెడ్డి.. ఉమ్మడిజిల్లాలోని 11 పాఠశాలలకు అందజేసిన స్పోర్ట్స్ కిట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముప్కాల్ మండల కేంద్రంలో రూ. 5 కోట్ల నిధులతో చేపట్టనున్న ఫోర్‌లేన్ బీటీరోడ్డు, సెంట్రల్‌లైటింగ్, డివైడర్ పనులకు శంకుస్థాపన చేచారు. ఐకేపీ మహిళా సంఘాలకు రూ. 15 కోట్ల 78 లక్షల రుణాలకు సంబంధించిన చెక్కును అందజేశారు.
ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. గతంలో బాల్కొండ నియోజకవర్గంలో ఒక్క టన్ను ధాన్యం కూడా నిల్వ చేసుకునేందుకు గోదాములు ఉండేవి కాదని, నేడు రూ. 25 కోట్లతో 40 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్లు నిర్మించామని తెలిపారు. ఇందుకు సహకరించిన సీఎం కేసీఆర్‌కు రైతుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయాలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, ధాన్యం ఉత్పత్తి.. ఏడేండ్లలో మూడు రెట్లు పెరిగిందన్నారు. లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు నిర్మించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి అన్ని రాష్ర్టాలూ ఆశ్చర్యపోతున్నాయని, అందుకే యావత్ దేశం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నదని తెలిపారు.
ఆంధ్రా ప్రజలు సైతం తెలంగాణ తరహా అభివృద్ధి కావాలని బహిరంగంగానే చెబుతున్నారని గుర్తుచేశారు. కరోనా లాంటి సంక్షోభ సమయంలోనూ సంక్షేమ పథకాలు ఆపలేదని చెప్పారు. ప్రజల కోసం పని చేస్తున్నది ఎవరు? మాటలు మాత్రమే చెప్పేది ఎవరనేది ప్రజలు ఆలోచించాలన్నారు. సీఎం కేసీఆర్ హైందవ ధర్మ పరిరక్షకుడని, ఆయన సహకారంతో ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే 50కి పైగా ఆలయాలను కట్టించామన్నారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్న వారు ఒక్క గుడి కూడా కట్టించలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి పేరు మీద రాజకీయాలు, అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు.
ఘన స్వాగతం..
మంత్రి పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. ముప్కాల్‌లో గజమాల, తలపాగ, తల్వార్‌తో సత్కరించారు. మహిళల మంగళహారతులు, బోనాలు, బ్యాండు మేళాల మధ్య స్వాగత ర్యాలీ కొనసాగింది.
రాష్ట్రంలో జనరంజక పాలన..
ముప్కాల్‌లో మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ జనరంజక పాలనతో అన్ని వర్గాలవారు సంతోషంగా ఉన్నారన్నారు. ప్రతి ఎన్నికలో బీఆర్ఎస్ను గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటాన్నారు. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కొత్త మండలాలను ఏర్పాటు చేశారని తెలిపారు. ముప్కాల్ మండల కేంద్రం వెలుగుజిలుగులతో హైదరాబాద్ మహానగరంలా కనిపించాలన్నారు. కేసీఆర్ పాలనలో ఎంత అభివృద్ధిని సాధించామో అందరికీ తెలుసన్నారు. ముప్కాల్ మండల రైతుల కోసం లక్ష్మీ కెనాల్ ఆధునికీకరణ పనులు చేపట్టాన్నామని, ఎత్తి పోతల పథకం నిర్మాణం మధ్యంతరంగా నిలిచిపోయినప్పటికీ కోట్ల రూపాయల నిధులు వెచ్చించి పునర్నిర్మాణం చేసుకున్నామన్నారు. ఆయా కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మానవీయ పథకాలు..
కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి మానవీయ పథకాలు దేశంలో ఎక్కడా లేవని, గత ముఖ్యమంత్రులు కూడా ఇలాంటి ఆలోచన చేయలేదన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 11లక్షల 56వేల కుటుంబాలకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.10వేల 323 కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. 12లక్షల 60వేల మంది బాలింతలకు రూ. 263కోట్ల విలువ చేసే కేసీఆర్ కిట్లు అందించామన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి పథకాలు ఎందుకు ఇవ్వడంలేదో ప్రజలు ప్రశ్నించాలన్నారు. అక్కడ చేయనోళ్లు ఇక్కడ చేస్తామంటే ఎలా నమ్ముతామన్నారు. అన్ని విధాలా సాయమవుతూ తోడుగా ఉంటున్న కేసీఆర్‌కు మద్దతుగా నిలువాలని మంత్రి ఈ సందర్భంగా కోరారు.