కామారెడ్డి జిల్లాలో 11 నెలల్లో 37 పెండ్లిళ్ల నిలిపివేత
సత్ఫలితాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు
క్షేత్రస్థాయిలో అధికారుల ముమ్మర చర్యలు
బాల్యవివాహాలతో కలిగే ఇబ్బందులపై అవగాహన
18 ఏండ్లు నిండిన ఆడబిడ్డల పెండ్లికి అక్కరకొస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు
భారంగా పెంచొద్దు.. ప్రభుత్వం చేయూతను అందిస్తుందని భరోసా
బాలికల చదువుకు సర్కారు కృషి
బాలికల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. సమైక్యరాష్ట్రంలో పేదరికం, పోషణ భారం, మూఢనమ్మకాలతో గ్రామీణ జనం ఆడబిడ్డలకు చిన్నవయస్సులోనే పెండ్లి చేసి అత్తారింటికి పంపి చేతులు దులుపుకొనేవారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేశాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో 18ఏండ్లు నిండిన ఆడబిడ్డల పెండ్లికి రూ.లక్షా116 ఆర్థికసాయం అందజేస్తున్నది. దీంతో బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడడంతోపాటు బాలికావిద్య మెరుగవుతున్నది. ఇతరత్ర కారణాలతో కొన్నిచోట్ల బాల్యవివాహాలకు కొందరు ప్రయత్నిస్తున్నా.. అధికార యంత్రాంగం అడ్డుకుంటున్నది. కామారెడ్డి జిల్లాలో గడిచిన 11 నెలల్లో 37 బాల్య వివాహాలను అధికారులు నిలిపివేశారు.
బాన్సువాడ, ఆగస్టు 28: పేదరికం, పోషణ భారం.. చదివించలేని స్థోమత, ఏండ్లు నిండిన తర్వాత పెండ్లి చేయా లంటే అప్పులు చేయాల్సిన పరిస్థితులు. ఆడపిల్ల పుట్టిందంటేనే చాలు భారంగా భావించడం, కొందరైతే ఆడపిల్ల అని తెలియగానే పురిట్లోనే చిదిమేసిన సంద ర్భాలు. పెండ్లీడు రాకుండానే పెండ్లి చేసి వదిలించుకునే ధోరణి ఉండేది. ఇదంతా గతం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనం తరం ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టింది. గ్రామాల్లో నిరక్షరాస్యత, మూఢనమ్మకాలను తొలగించింది. ప్రజ లకు ఉపాధి చూపి పేదరికాన్ని రూపు మాపింది. బాలికల విద్యకు ప్రాధాన్యమిచ్చింది. వారి కోసం ప్రత్యేకంగా వసతి గృహాలు ఏర్పాటు చేసి కేజీ నుంచి పీజీ వరకు, అంతకు మించి చదివేలా సౌకర్యా లు కల్పించింది. 18ఏండ్ల అనంతరం పెండ్లి చేస్తే మేన మామలా కట్నం ఇస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేశారు. దీంతో గ్రామీణుల్లో మార్పు వచ్చిం ది. బాల్య వివాహాలకు చెక్‌పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థను పటిష్టం చేసింది. ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతోందని తెలిసిన వెంటనే చైల్డ్ మ్యారేజ్ ప్రివెన్షన్ ఆఫీసర్‌తోపాటు పోలీసు, రెవెన్యూ, సంక్షేమ శాఖ అధికారులు వాలిపోతున్నారు. కామారెడ్డి జిల్లాలో 11 నెలల వ్యవధిలోనే 37 బాల్య వివాహాలను నిలిపివేసి ఆయా కుటుంబాలకు అవగాహన కల్పించడమే దీనికి నిదర్శనం.
జిల్లాలో 37 బాల్య వివాహాలకు అడ్డుకట్ట…
బాల్య వివాహాలను అపేందుకు చైల్డ్ మ్యారెజ్ ప్రివెన్షన్ ఆఫీసర్ (సీఎంపీవో)లతోపాటు రెవెన్యూ, పోలీసు అధికారులు పనిచేయాల్సి ఉంది. అయితే, ఈ మూడు విభాగాలు కలిసి పనిచేస్తుండడంతో తమకు అందిన సమాచారంతో వేగంగా చర్యలు చేపడుతున్నారు. దీంతో జిల్లాలో బాల్యవివాహాలు తగ్గుతున్నాయని మహిళా శిశు సంక్షేమ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 11 నెలల్లో 37 బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేశారు. అందులో బీబీపేట మండలంలో 1, రాజంపేటలో 5, భిక్కనూర్‌లో 2, సదాశివనగర్‌లో 3, మాచారెడ్డిలో 4, రామారెడ్డిలో 2, లింగంపేట్‌లో 2, నాగిరెడ్డిపేటలో 2, తాడ్వాయిలో 2, నిజాంసాగర్‌లో 1, జుక్కల్‌లో 1, ఎల్లారెడ్డిలో 5, గాంధారిలో 1, బీర్కూర్‌లో 5, బాన్సువాడ మండలంలో ఒకటి ఉన్నాయి.
ప్రభుత్వ పథకాలపై అవగాహన
కామారెడ్డి జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్, కస్తూర్బా బాలికల పాఠశాలల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతోపాటు విద్యాహక్కు చట్టం, చిన్న పిల్లలపై నేరాలు, తదితర పథకాలపై బాలికలకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. 18 ఏండ్లు నిండిన తర్వాతే ఆడపిల్లలకు పెండ్లి చేస్తే ప్రభుత్వ పథకాలైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా రూ.లక్షా116 వస్తాయని వివరిస్తున్నారు. దీంతో అటు బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడడంతోపాటు ఆడపిల్లలు హాయిగా చదువుకునేలా ప్రభుత్వం కృషి చేసినట్లయ్యింది.
కమిటీలు బాధ్యతగా పనిచేయాలి
గ్రామాల్లో నిరక్షరాస్యత, మూఢనమ్మకాలే బాల్య వివాహాలు చేసేందుకు కారణమవుతున్నాయని తెలుస్తోంది. బాల్య వివాహాలను అడ్డుకునేందుకు గ్రామీణ స్థాయిలో ప్రత్యేక గ్రామ కమిటీలను సర్కారు ఏర్పాటు చేస్తున్నది. గ్రామ సర్పంచ్ చైర్మన్‌గా, అంగన్వాడీ టీచర్లు కన్వీనర్లుగా ఉండడంతోపాటు కమిటీలో 15 మంది సభ్యులు ఉంటారు. వివాహ నమోదు చట్టం ప్రకారం 18 ఏండ్లు నిండిన బాలబాలికలకు పెండ్లి జరిగేలా కమిటీ కృషి చేయాల్సిన అవసరం ఉంది.
బాల్యవివాహాలతో కష్టనష్టాలివే..
శారీరక మానసిక వికాసం, భావోద్వేగం, మేథస్సు మందగించడం. 10-15 ఏండ్ల బాలికకు 25-30 సంవత్సరాల వయస్సు పురుషులతో వివాహం చేయడంతో ఇద్దరి మధ్య వయోభేదం ఏర్పడుతుంది. అభిరుచులు కలువవు. జీవితంపై అవగాహన లోపిస్తుంది. బాల్యంలో గర్భందాల్చడంతో తల్లీబిడ్డలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.
చట్టాలు ఏం చెబుతున్నాయంటే….
బాల్య వివాహాలు చేస్తే కఠినమైన శిక్షలు ఉన్నాయి. 2006 బాల్య వివాహాల చట్టం (జీవోఎంఎస్ 10 ) ప్రకారం రెండేండ్ల జైలు శిక్షతోపాటు లక్ష రూపాయలు వరకు జరిమానా విధిస్తారు. బాల్య వివాహం చేస్తే వివాహం నిర్వహించిన వారు, ప్రోత్సహించిన వారు, బంధువులు చట్ట ప్రకారం శిక్షార్హులవుతారు. బాల్యవివాహాలను ఎవరైనా నిలిపివేయవచ్చు. బాల్యవివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1098కు సమాచారం అందించవచ్చు. బాలికలను జిల్లా బాలల సంక్షేమ కమిటీ ఎదుట హాజరుపర్చి ప్రభుత్వ బాల సదనాలకు తరలిస్తారు. అవగాహన కల్పిస్తారు. విద్యతోపాటు వృత్తివిద్యా నైపుణ్య కోర్సులను నేర్పిస్తారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చేర్చి ఉచిత విద్యను అందిస్తారు.
ఆడపిల్లను భారంగా భావించొద్దు..
ఆడపిల్లలను భారంగా భావించొద్దు. 18 ఏండ్లు నిండిన వివాహాలకే ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా చేయూతనిస్తున్నది. అంతేగాకుండా విద్యాహక్కు చట్టం ప్రకారం పదో తరగతి వరకు బాలికలను చదివించాల్సిందే. ఆడపిల్లలు చదివించి, వారి కాళ్లమీద వారు నిలబడేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.