జగిత్యాల, జూలై 7 (నమస్తే తెలంగాణ) : మల్లాపూర్ మండలంలోని ఎస్సారెస్పీ పునరావాస గ్రామం నడికుడ.. వెయ్యి లోపు జనాభానే ఉన్నా అభివృద్ధిలో మాత్రం ఆదర్శంగా నిలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అందిపుచ్చుకొని, ప్రగతి మార్గంలో సాగిపోతున్నది.. గ్రామంలో 225 కుటుంబాలు ఉండగా, 995 మంది నివసిస్తున్నారు. ఈ గ్రామానికి పల్లెప్రగతి కింద సుమారు రూ.25 లక్షల మేర నిధులు విడుదలయ్యాయి. దీంతో గ్రామ సర్పంచ్ భూక్య రుక్మ, కార్యదర్శి సరిత ఆధ్వర్యంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు సమష్టి కృషితో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకంపై గ్రామస్తులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే పల్లె ప్రగతి పనులను చేయడంతో పాటు, రికార్డులు, పనితీరుతో జిల్లా స్థాయి ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డుకు ఎంపికైంది.
గ్రామంలో చేపట్టిన పనులు
పల్లె ప్రకృతి వనం ఏర్పాటు, డంప్‌యార్డు, కంపోస్ట్ షెడ్ నిర్మాణాలు చేపట్టి పనులను పూర్తి చేశారు.
ఆరు పాతబావులను గుర్తించి మొరంతో పూడ్చి వేయడంతో పాటు, సుమారు 777 మీటర్ల మేర డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను తీసి వేసి బ్లీచింగ్ పౌడర్ చల్లారు.
గ్రామంలో మహిళా సంఘాల సభ్యులతో కలిసి సుమారు 600 మొక్కలను నాటి కంచెలను ఏర్పాటు చేశారు. గ్రామ శివారులో మంకీ ఫుడ్‌కోర్టులో 400 పండ్ల మొక్కలను నాటి, ట్రీగార్డులను అమర్చారు.
గ్రామంలో అందరి కృషితో 90 శాతానికి పైగా ఇంటి పన్నులు వసూలు చేశారు.
అన్ని వీధుల్లో నూతన స్తంభాలను ఏర్పాటు చేసి ఎల్ఈడీ బల్బులు అమర్చారు. అలాగే చిన్న గ్రామపంచాయతీ అయినప్పటికీ విద్యుత్‌శాఖకు రూ.లక్ష విద్యుత్ బకాయిలు చెల్లించారు.
గ్రామంలో ప్రతి కుటుంబానికి తడి, పొడి చెత్త బుట్టలను అందించారు. గ్రామంలో ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తే రూ.500 జరిమానా విధించాలని ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. వారానికొకసారి గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేసి చెత్తను తొలగిస్తారు.
అందరి సహకారంతో అభివృద్ధి
గ్రామ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల సమష్టి కృషితోనే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం. సమస్యలను ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు దృష్టికి తీసుకెళ్లిన. పల్లె ప్రగతి పనుల ద్వారా నా హయాంలో గ్రామం అభివృద్ధి చెందడం ఆనందంగా ఉంది.
ప్రణాళికా ప్రకారం పనులు చేశాం
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామంలో పల్లె ప్రగతికి సంబంధించి అన్ని రకాల పనులను చేపట్టి త్వరితగతిన పూర్తి చేశాం. ముందుగా ఈ పనులపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామస్తులందరికీ ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాం. గ్రామంలో మేం చేపట్టిన పనులను ఉన్నతాధికారులు పరిశీలించి పలుసార్లు ప్రశంసించడం ఆనందంగా ఉంది.