ఆదర్శం కాలూర్ పూర్వ విద్యార్థులు
నాలుగేండ్ల కిందటే ప్రైమరీ, హైస్కూళ్లల్లో ప్రారంభమైన ఇంగ్లిష్ మీడియం
ఉపాధ్యాయులతో కలిసి ఇంటింటా ప్రచారం
నిజామాబాద్ రూరల్, ఫిబ్రవరి 13;నిజామాబాద్ నగరపాలక సంస్థలోని ఒకటో డివిజన్ పరిధిలో ఉన్న కాలూర్ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం విద్యాబోధనతో ఏటా విద్యార్థుల తగ్గుతూ వచ్చింది. గ్రామంలోని తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియం చదివించాలని కష్టాలకోర్చి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నిజామాబాద్ నగరంలోని ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించారు. దీంతో గ్రామంలోని రెండు ప్రభుత్వ పాఠశాలలు మూతబడే పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో 2018 పూర్వ విద్యార్థి, నుడా డైరెక్టర్ ముస్కె సంతోష్ పూర్వవిద్యార్థులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రైమరీ, హైస్కూళ్లలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రారంభించి బడులను కాపాడుకోవాలని నిర్ణయించారు. రెండు పాఠశాలలకు కలిపి ఒక డెవలప్మెంట్ కమిటీని పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి చైర్మన్‌గా నియామకమైన సంతోష్ తోటి పూర్వవిద్యార్థులతో పాటు ప్రైమరీ, హైస్కూళ్ల హెడ్మాస్టర్లు సుధాకర్‌రెడ్డి, సుహాసిని, ఉపాధ్యాయులు సమష్టి నిర్ణయంతో పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అదే ఏడాది వేసవి సెలవుల్లోనే పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు బృందాలుగా ఏర్పడి కరపత్రాలు పంపిణీ చేస్తూ ఇంటింటా ప్రచారం చేశారు. గ్రామంలోని ప్రభుత్వ ప్రైమరీ, హైస్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం విద్యాబోధన ప్రారంభిస్తున్నామని, తమ పిల్లలను ఇక్కడే చేర్పించాలని విజ్ఞప్తి చేశారు.
తల్లిదండ్రుల ఆసక్తితో పెరిగిన విద్యార్థుల సంఖ్య
2018 విద్యా సంవత్సరంలో విద్యార్థుల తల్లిదండ్రులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ పిల్లలను ప్రభుత్వ ప్రైమరీ, హైస్కూళ్లల్లో చేర్పించడానికి ఆసక్తి చూపారు. అప్పటి వరకు ప్రైమరీ స్కూల్లో 18 మంది విద్యార్థులుండగా ఇంగ్లిష్ మీడియం విద్యాబోధన ప్రారంభించిన ఫలితంగా ఆ ఏడాదే 145 మంది విద్యార్థులు చేరారు. హైస్కూల్లో కూడా ఇంగ్లిష్ మీడియం ప్రారంభించడంతో 6 నుంచి 8వ తరగతి వరకు 80 మంది విద్యార్థులు చేరారు. ప్రస్తుతం ప్రైమరీ స్కూల్లో 185 మంది విద్యార్థులు, హైస్కూల్లో 135 మంది మొత్తం 320 మంది విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం విద్యాబోధన కొనసాగుతున్నది.
విరాళాలు సమకూర్చిన పూర్వ విద్యార్థులు
40 మంది పూర్వ విద్యార్థులు తొలుత విరాళాలు అందించారు. గ్రామంలోని పలువురు దాతల నుంచి కూడా విరాళాలు సేకరించారు. మొత్తం విరాళాల ద్వారా రూ.3 లక్షలు జమ కాగా విద్యార్థుల కోసం డెస్క్ బెంచీలు, యూనిఫామ్, పాఠ్య పుస్తకాలను సమకూర్చారు. పాఠశాల భవనాలను రంగులతో తీర్చిదిద్దారు. ఇంగ్లిష్ మీడియం విద్యాబోధన కోసం ఐదుగురు బీఈడీ చదివిన వలంటీర్లను నియమించారు.
ఎమ్మెల్సీ చేయూత
పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మాణానికి ఎమ్మెల్సీ వీజీగౌడ్ రూ.2లక్షలు మంజూరు చేయగా వాటి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రూ.1.50 లక్షలతో మరుగుదొడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
పాఠశాలలను కాపాడుకున్నాం..
మూతబడే పరిస్థితికి చేరిన ప్రభు త్వ ప్రైమరీ, హైస్కూళ్లను కాపాడుకున్నాం. పూర్వ విద్యార్థులందరూ సమష్టి కృషిచేసిన ఫలితంగా రెం డు స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించాం. దీంతో తల్లిదండ్రు లు తమ పిల్లలను ఇదే పాఠశాలలకు పంపిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు స్వస్తి పలకడం తో పేద కుటుంబాల విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టే భారం తగ్గింది. ప్రభుత్వం మనఊరు- మనబడి ప్రారంభిస్తుండడంతో ఇతర గ్రామాల్లో మూతబడే పాఠశాలలు కూడా ప్రాణం పోసుకుంటాయి.
– ముస్కె సంతోష్, నుడా డైరెక్టర్, స్కూల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్