లింగంపేట, ఫిబ్రవరి 13: నేర రహిత సమాజ స్థాపన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ‘మార్పు కోసం ఒక్క అడుగు’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అవార్డు గ్రహీత, శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డికి ఆత్మీయ సన్మానం కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. యువత మట్కా, గుట్కా, నేరాలవైపు వెళ్లకుండా సహనం, సౌభ్రాతృత్వం కలిగి ఉండాలని సూచించారు. సమాజ అభివృద్ధి కోసం యువత పాటుపడాలని పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా 1175 మంది పోలీసులు ప్రజల రక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారని తెలిపారు. ప్రజల సహకారంతో నేరాల సంఖ్య తగ్గుతున్నదని చెప్పారు.
అనంతరం సన్మాన గ్రహీత, శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ.. తన జీవితం సమాజ సేవకు అంకితమన్నారు. విద్యార్థులు, యువకులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రతిఒక్కరూ స్వార్థాన్ని వీడి సేవాభావం కలిగి ఉండాలని అన్నారు. అనంతరం ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి మార్పు కోసం ఒక్క అడుగు సంస్థ ప్రతినిధులతో కలిసి పైడి ఎల్లారెడ్డిని ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో ఉస్మానియా దవాఖాన ప్రొఫెసర్ డాక్టర్ రామ్‌సింగ్, విద్యావేత్త హరిస్మరణ్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, సాందీపని విద్యాసంస్థల డైరెక్టర్ అశోక్‌రావు, పీఆర్టీయూ టీఎస్ మండల అధ్యక్షుడు కొట్టూరి సురేశ్, ఎల్లారెడ్డి సీఐ శ్రీనివాస్, బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వహీద్ సిద్దిఖీ, కార్యక్రమ నిర్వాహకులు రజినీకాంత్‌గౌడ్, నారాయణ, తోట సాయిలు, మన్నె కృష్ణ, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన నాయకులు, విద్యార్థులు, విద్యావేత్తలు పాల్గొన్నారు.