ఈ నెల 15,16వ తేదీల్లో నిర్వహణ
జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతిరావు వెల్లడి
ఖలీల్‌వాడి ఫిబ్రవరి 13: సీఎం కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఈ నెల 15,16వ తేదీల్లో కేసీఆర్ కప్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతిరావు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కవిత ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆదివారం ఆయన జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. క్రీడాకారులు ఈ నెల 14వ తేదీ సాయంత్రం లోపు హైదరాబాద్‌లో రిపోర్ట్ చేయాలని సూచించారు. ప్రథమ బహుమతిగా రూ. లక్ష నగదు, ద్వితీయ బహుమతిగా రూ. 50వేలు, తృతీయ బహుమతిగా రూ. 20వేలు , నాల్గో బహుమతిగా రూ. 10వేలు అందించనున్నట్లు వివరించారు. ఉమ్మడి జిల్లా నుంచి వాలీబాల్ అసోసియేషన్ ఎంపిక చేసిన జట్లు మాత్రమే హైదరాబాద్‌కు రావాల్సి ఉంటుందని తెలిపారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ కవిత ప్రతి ఏడాది కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, ఫుట్‌బాల్ తదితర క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. చాలా మంది క్రీడాకారులు ప్రతిభ కనబరిచి జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని అన్నారు. ఎంతో మంది క్రీడాకారులకు ఆర్థిక సాయం అందజేస్తూ ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. జాగృతి రాష్ట్ర నాయకులు లక్ష్మీనారాయణ భరద్వాజ్, నరాల సుధాకర్, వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మల్లేశ్‌గౌడ్, పవన్‌కుమార్, హరీశ్‌యాదవ్, భూపతి తదితరులు పాల్గొన్నారు.