తాడ్వాయి, ఏప్రిల్ 20 : క్షణికావేశంలోనే తాడ్వాయికి రౌడీ షీటర్ చెందిన లాలమ్మ సంతోష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సంతోష్ బుధవారం రాత్రి ఒంటిపై పెట్రోల్ పోసుకొని పోలీసుస్టేషన్లోకి వచ్చి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఎస్పీ గురువారం తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను పరిశీలించి సంఘటన వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. సంతోష్ కొంతకాలంగా దొంగతనాలు, బెదిరింపులు, కిడ్నాప్‌లకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. దీంతో పలువురు సంతోష్ ఆరాచకాలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఎన్నోసార్లు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినా మార్పు రాకపోవడంతో కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా సంతోష్‌లో మార్పు రాలే దు. దీంతో 2019లో రౌడీషీట్ ఓపెన్ అయ్యింది. సంతోష్‌పై 8 కేసులు ఉన్నాయని అన్ని కేసుల్లో జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటికి వచ్చాడు. బుధవారం మండలంలోని నందివాడకు చెందిన వారితో గొడవ పెట్టుకున్నాడు. దీంతో వారు సంతోష్ సెల్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లారు. సంతోష్ డయల్ 100 నాలుగు సార్లు ఫోన్ చేశాడు. తక్షణమే స్పందించిన పోలీసులు సంతోష్ ఇంటికి వెళ్లగా ఫోన్ తీసుకెళ్లిన వారి వివరాలను తెలుపలేదు. దీంతో పోలీసులు రాత్రి 8.30 గంటల ప్రాంతం లో స్టేషన్‌కు తిరిగి వచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులతో గొడవపడిన సంతోష్ ఇంట్లో ఉన్న రాడ్ తీసుకొని పాతబస్టాండ్ వద్ద పెట్రోల్ కొనుక్కొని స్టేషన్ సమీపంలో ఒంటిపై పోసుకున్నాడు. రాత్రి 9.45 గంటల ప్రాంతంలో సంతోష్ స్టేషన్లోకి వ చ్చాడు.
ఎస్సై లేకపోవడంతో డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లు మహేందర్‌గౌడ్, రవి, సతీష్‌గౌడ్, సాయిబాబా, సుదర్శన్ విషయం తెలుసుకునేందుకు వచ్చేలోపే నిప్పంటించుకున్నాడు. భయాందోళనకు గురైన సిబ్బంది వెంటనే మంటలు ఆర్పి పెట్రోలింగ్ వాహనంలోనే కామారెడ్డి ప్రభుత్వ దవాఖాకు తరలించారు. దాదాపు 90 శాతం శరీరం కాలిపోయింది. మెరుగైన వైద్యం కోసం అక్కడి వైద్యులు హైదరాబాద్‌కు తరలించారు. సంతోష్ ఫిబ్రవరి 25వ తేదీన రాత్రి ఇదే విధంగా ఒంటిపై కిరోసిన్ పోసుకొని స్టేషన్‌కు వచ్చాడు. అప్పుడు కౌ న్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారని ఎస్సీ తెలిపారు. సంతోష్ మానసిక స్థితి సరిగాలేక చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజలను భయాందళోనకు గురిచేసే వాడని తెలిపారు. మంటలను ఆర్పి సంతోష్‌ను దవాఖానకు తరలించిన కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించారు. సంతోష్‌కు భార్య సోను, ఏడాది కుమారుడు ఉన్నాడు. సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రామన్, ఎస్సై ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
సంతోష్ సెల్‌ఫోన్ తీసుకెళ్లిన వారి ఆచూకీ లభ్యం
సంతోష్ సెల్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లిన వారి ఆచూకీ దొరికిందని ఎస్సై ఆంజనేయులు తెలిపారు. నందివాడ పరిధిలోని సామదుబ్బ తండాకు చెందిన దేవసోత్ శివరాం, సాయికుమార్‌లుగా గుర్తించినట్లు ఎస్సై తెలిపారు. సంతోష్‌తో బుధవారం శివరాంనాయక్ చెందిన సెల్‌ఫోన్‌ను తీసుకొచ్చాడు. దీంతో సాయంత్రం వారు వచ్చి సంతోష్ ఫోన్‌ను తీసుకెళ్లినట్లు గుర్తించామని ఎస్సై తెలిపారు.