పెద్ద కొడప్గల్ (పిట్లం), జూన్ 7: పిట్లం మండలం చిన్నకొడప్గల్ పంచాయతీ కార్యదర్శి ధారావత్ కృష్ణ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. చిన్నకొడప్గల్ చెరువులో మృతదేహం లభ్యంకాగా.. హత్యకు గురై ఉంటాడని కుటుంబీకులు, స్థానిక పోలీసులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. కుటుంబ సభ్యులు, ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్లం మండలంలోని రూమ్ తండాకు చెందిన ధారావత్ కృష్ణ (28) మండలంలోని చిన్న కొడప్గల్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
గురువారం రాత్రి 9.30 గంటల నుంచి కనిపించకుండా వెళ్లిన కృష్ణ శనివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో చిన్న కొడప్గల్ రెడ్డి చెరువులో మృతదేహమై తేలాడు. విషయం తెలుసుకున్న బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి, సీఐ రాజశేఖర్, ఎస్సై రాజు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. డాగ్స్కాడ్తో తనిఖీలు నిర్వహించారు. తన కొడుకును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని తల్లి మీరిబాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా దవాఖానకు తరలించారు. హత్య చేసిన నిందితులను త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.