నవీపేట, జూలై 31: అఘాయిత్యానికి గురైన తన బిడ్డకు న్యాయం చేయాలని కోరుతూ ఓ తండ్రి ప్రాణత్యాగానికి సిద్ధమయ్యాడు. రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యాయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. నవీపేట మండలం ధర్యాపూర్ శివారులో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై యాదగిరిగౌడ్ కథనం ప్రకారం.. మండలంలోని ఓ ప్రాంతానికి చెందిన బాలిక(15)పై నవీపేట వాసి సాయికృష్ణ కన్నేశాడు. నాలుగు నెలల క్రితం ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయితే, బాధితురాలికి న్యాయం జరుగడం లేదని, ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.2 లక్షల పరిహారం ఇంకా అందలేదని బాలిక తండ్రి ఆవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే అతడు బుధవారం దర్యాపూర్ వద్ద గల రైలుపట్టాలపై పడుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టగా పోలీసులు అడ్డుకున్నారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.