భీమ్‌గల్, జూలై 26: గ్రామీణ ప్రాంత ప్రజలు, కక్షిదారులకు వేగవంతమైన, సులువైన న్యాయ సేవలు అందించడమే లక్ష్యమని రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ తంగిరాల మాధవీ దేవి అన్నారు. భీమ్‌గల్ పట్టణంలో ఏర్పాటు చేసిన జూనియర్ సిలిల్ జడ్జి కం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును ఆదివారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ఆమెతోపాటు తెలంగాణ హైకోర్టు జడ్జీలు జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ గాడి ప్రవీణ్‌కుమార్, నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భారతలక్ష్మి హాజరయ్యారు. ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాధవీదేవి మా ట్లాడారు. కొత్త కోర్టుల ఏర్పాటు అంటే కేవలం భవనాలను ప్రారంభించడం కాదని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 39 ఏ ప్రకారం పౌరులందరికీ సమాన న్యాయంతోపాటు ఉచితంగా చట్టపరమైన సేవలు అందించే రాజ్యాంగబద్ధ బాధ్యతను పునరుద్ధరించడమేనని పేర్కొన్నారు. నూతన కోర్టు ఏర్పాటుతో మండలంతోపాటు పరిసర మండలాల ప్రజలు ఇకపై కోర్టు పనుల నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం తప్పిందని తెలిపారు. సమయంతోపాటు వారికి ఆర్థిక భారం కూడా తగ్గుతుందన్నారు.
భీమ్‌గల్‌లో నూతనంగా ప్రారంభించిన కోర్టుకు ఆర్మూర్, నిజామాబాద్ కోర్టుల నుంచి దాదాపు 300 సివిల్ కేసులు, 1300 క్రిమినల్ కేసులతో కలుపుకొని మొత్తం 1600 కేసులు బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పాత కోర్టులమీద కేసుల భారం తగ్గడమే కాకుండా విచారణలు వేగవంతమవుతాయని తెలిపారు. అనతికాలంలోనే జిల్లా మినరల్ ఫౌండేషన్ నిధులతో మండల సమైఖ్య భవనాన్ని పునర్నిర్మించి కోర్టును అందుబాటులోకి తేవడం అభినందనీయమని పేర్కొన్నారు. సివిల్ జడ్జిగా భవ్యశ్రీ విధులు నిర్వహిస్తారని తెలిపారు. సోమవారం నుంచి కోర్టు కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ప్రారంభమవుతాయని చెప్పారు.
కోర్టు గొప్పతనం భవన పరిమాణంపై ఆధారపడి ఉండదని, అక్కడ లభించే న్యాయం నాణ్యతపై ఆధారపడి ఉంటుందని జస్టిస్ మాధవీదేవి పేర్కొన్నారు. సహనం, నిష్పక్షపాతం, నిజాయితీ, న్యాయ క్రమ శిక్షణలే ప్రజల్లో నమ్మకాన్ని నిలబెడతాయన్నారు. కక్షిదారులకు చట్టపరిధిలోనే సరైన న్యాయం జరుగుతుందన్న భరోసాను కల్పించాలని జడ్జీలకు సూచించారు. న్యాయ వ్యవస్థలో బెంచ్, బార్లు రెండు సమాన భాగస్వాములని, సంస్థ పురోగతికి న్యాయవాదుల సహకారం తప్పనిసరిగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం నూతన కోర్టులో జడ్జికి బాధ్యతలను అప్పగించారు. కార్యక్రమంలో ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కే. ప్రవీణ్ చందర్, న్యాయవాదులు గజ్జెల చైతన్య, సూర సురేష్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాధులు, స్థానిక ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కోర్టు ప్రారంభోత్సవానికి వచ్చిన హైకోర్టు జడ్జిలు జస్టిస్ తంగిరాల మాధవీదేవి, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్‌తో పాటు జిల్లా కోర్టు సెషన్స్ జడ్జి జీవీఎన్ భారత లక్ష్మి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన లింబాద్రి గుట్టకు చేరుకున్నారు. అక్కడ వీరికి ఆలయ ధర్మకర్త నంబి పార్థ సారథి ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి గర్భాలయంలోకి తీసుకెళ్లారు. అక్కడ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అర్చన చేసి హారతి ఇచ్చారు. అనంతరం స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించి స్వామి వారి చిత్రపటాన్ని, బహూకరించారు. అనంతరం ఆలయ విశిష్టత గురించి వివరించారు. కార్యక్రమంలో న్యాయమూర్తుల కుటంబ సభ్యులతో పాటు పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.