బాన్సువాడ టౌన్, డిసెంబర్ 14 : ప్రవాస భారతీయులు పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడం అభినందనీయమని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ సారి బాన్సువాడ వంద పడకల మాతా-శిశు దవాఖానకు ఆర్వో ప్లాంట్, ఈసీజీ మిషన్‌ను ఎమ్మెల్యే పోచారం చేతుల మీదుగా గురువారం దవాఖాన సూపరింటెండెంట్‌కు అసోసియేషన్ సభ్యులు అందజేశారు. ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ జన్మభూమి రుణం తీర్చుకోవాలన్న ఆశయంతో తమ సంపాదనలో కొంత మొత్తాన్ని ఖర్చు చేసి, పేద ప్రజల సౌకర్యార్థం బాన్సువాడ మాతా-శిశు దవాఖానలో మంచినీటి శుద్ధి యంత్రం, ఈసీజీ యంత్రాన్ని ఏర్పాటు చేసిన ఆటా సభ్యులకు, జనహిత సంస్థ నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. బాన్సువాడ మాతా-శిశు కేంద్రంలో హైదరాబాద్ కార్పొరేట్ దవాఖానలకు తీసిపోని విధంగా అన్ని సౌకర్యాలను కల్పించా మన్నారు. దీంతో దేశంలోనే అత్యున్నత పురస్కారం అయిన కాయకల్ప అవార్డు ఐదు సార్లు, లక్ష్య అవార్డు రెండుసార్లు వచ్చిందని, అంతేకాకుండా బ్రెస్ట్ ఫీడింగ్ ఏకో అవార్డు అందుకున్న ఏకైక ప్రభుత్వ దవాఖానగా బాన్సువాడ మాతా-శిశు దవాఖాన నిలిచిందని తెలిపారు. బాన్సువాడ పట్టణ ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న ఏరియా దవాఖాన, మాతా-శిశు కేంద్రాలను అనుసంధానం చేయడానికి స్టీల్ బ్రిడ్జిని నిర్మించామన్నారు. కార్యక్రమంలో ఆటా చైర్మన్ ఎలక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా, కార్యదర్శి రామకృష్ణారెడ్డి, దాతలు డాక్టర్ హిమబిందు రెడ్డి, బోడ అశ్వినీ రెడ్డి, జనహిత సంస్థ నిర్వాహకులు ఆర్. సతీష్ రెడ్డి, బోడ రఘుపతి రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు ఎజాజ్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, కౌన్సిలర్లు, నర్సింగ్ సూపరింటెండెంట్ కృష్ణవేణి, ఆరోగ్య జ్యోతి, శాంతాకుమారి, మల్లీశ్వరి, సుబ్బాయమ్మ, స్థానిక నాయకులు, దవాఖాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవడానికి వచ్చి న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) సభ్యు లు బీర్కూర్ మండలం తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే పో చారం దగ్గరుండి ఆలయం గురించి వివరించారు.