ఆమె.. సమాజానికి మాతృమూర్తి. పాలనలో చైతన్య దీప్తి. అన్ని రంగాల్లో నిర్ణయాత్మక శక్తి. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళ ఇప్పుడు అన్నింట్లోనూ దూసుకెళ్తున్నది. పురుషాధిపత్యాన్ని సవాల్ చేస్తూ సగౌరవంగా నిలబడుతున్నది. సమాజాన్ని ముందుకు నడిపిస్తున్నది. కేసీఆర్ సర్కారు చేయూతతో అతివలు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో విశేషంగా రాణిస్తున్నారు. స్థానిక సంస్థల పీఠాలను అధిష్టించి పాలనలో తమదైన ముద్ర వేస్తున్నారు. ఉన్నత కొలువులను సాధించి నిర్ణయాత్మక శక్తిగా నిలుస్తున్నారు. విద్య, వైద్య, వ్యాపార, క్రీడా రంగాల్లో సత్తా చాటుతున్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కవిత, క్రీడాకారులు గుగులోత్ సౌమ్య, నిఖత్ జరీన్, యెండల సౌందర్య వంటి వారు జాతీయ స్థాయిలో ఇందూరు ఖ్యాతిని ఇనుమడింపజేశారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఎంతో మంది మహిళలు రాజకీయాల్లో రాణిస్తున్నారు. వివిధ రంగాల్లో విజేతలుగా నిలిచిన మహిళల ప్రస్థానంపై అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనాలు..
చేతిలో గరిట.. చాటలో బియ్యం.. కాలికింద కత్తిపీట.. పొయ్యిలో కట్టెలు.. పొయ్యిమీద కుండ.. ఇవే ఒకప్పుడు ఆడదానికి ఉండే ‘పాత్ర’లు. వాటితో వండి వార్చి ఇంట్లోని కుటుంబసభ్యుల కడుపునిండా భోజనం పెట్టేవారే ఆడవారి లక్షణాలంటూ అప్పట్లో పెద్దలు కితాబిచ్చేవారు. అయితే కాలం మారింది. లోకం తీరూ మారింది. ఆడవారు వంటింటికే పరిమితం కాలేకపోతున్నారు. అతివలు తలుచుకుంటే రాజ్యమేలవచ్చని నేటి మహిళలు నిరూపిస్తున్నారు. ఆధునికత సంతరించుకున్నా.. వంటింటి గోడల్ని దాటి రంగుల ప్రపంచంలో ఇంద్రధనస్సులా మెరిసిపోతున్నా మహిళ తన ప్రేమైక జీవన మృదుత్వాన్ని వదిలిపెట్టలేదు. అమ్మగా.. చెల్లిగా.. భార్యగా తన సృష్టి ధర్మాన్ని విడిచిపెట్టలేదు. పురుషాధిక్యానికి సవాల్ విసురుతూనే .. తనకున్న బాధ్యతల బరువునూ ఓరిమితో మోస్తూ వస్తున్నది. ఎందరో మహిళామణులు తమ చైతన్యస్ఫూర్తితో ప్రేమైక దీప్తితో ప్రపంచ మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వార్డు మెంబర్ నుంచి చట్టసభల వరకు… ఆటల నుంచి ఐఏఎస్ వరకు మన ఆడబిడ్డలు ముందంజలో ఉంటున్నారు. అలాంటి మహిళలందరికీ జేజేలు పలుకుతూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో స్ఫూర్తిగా నిలుస్తున్న వారిపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం…
ఐఏఎస్‌గా చౌట్పల్లి ఆడబిడ్డ
కమ్మర్ల్లి, మార్చి 7: కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి గ్రామానికి చెందిన భోగ విశ్వశ్రీ పేద కుటుంబం నుంచి ఐఏఎస్ సాధించి ఆదర్శంగా నిలిచారు. పెండ్లి చేసి అత్తారింటికి సాగనంపే ఆడపిల్లకు తూతూ మంత్రంగా చదివిస్తే చాలనుకోకుండా ఉన్నత స్థితిలో నిలపాలనుకున్నాడు చౌట్పల్లికి చెందిన భోగ నిత్యానంద్. సాధారణ కిరాణ షాపు నడుపుకొంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తూనే తన కూతురికి చిన్ననాటి నుంచే మంచి చదువులు అందించాడు. తండ్రి ఆశయాన్ని అర్థం చేసుకున్న విశ్వశ్రీ చదువుల్లో రాణిస్తూ ముందుకు సాగారు. బీటెక్, ఎంబీఏ చదివిన ఆమె ఉమ్మడి రాష్ట్రంలో సెర్ప్‌లో పనిచేశారు. 2103లో యూపీఎస్సీ రాసి రైల్వే సర్వీస్‌లో ఉన్నత ఉద్యోగం సాధించారు. పెండ్లి చేసుకున్నాక వరల్డ్ బ్యాంక్ అడ్వయిజర్‌గా పనిచేసే భర్త భానుశ్యామ్..విశ్వశ్రీ ఐఏఎస్ కావాలన్న తపనను ప్రోత్సహించారు. దీంతో 2014లో విశ్వశ్రీ ఐఏఎస్ సాధించారు. త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తాల, సిపాయిజల కలెక్టర్‌గా, త్రిపుర టూరిజం డైరెక్టర్‌గా పని చేసిన విశ్వశ్రీ ప్రస్తుతం త్రిపుర ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
సమస్య గుర్తించిన వెంటనే స్పందన
బోధన్, మార్చి 7: బోధన్ పట్టణంతోపాటు నియోజకవర్గంలో వ్యక్తిగతంగా ఏర్పడుతున్న సమస్యల పరిష్కారంతోపాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో తనవంతు భాగస్వామ్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతోంది బోధన్ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా. ఆమె చేపడుతున్న స్వచ్ఛంద కార్యక్రమాలు ఎనలేనివిగా మారుతున్నాయి. ‘ఆయేషా వెల్ఫేర్ ట్రస్ట్’ను ఏర్పాటు చేసిన ఆమె సేవా కార్యక్రమాలను విస్తృతం చేసేందుకు నడుంబిగించారు. ఏటా సంక్రాంతి సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తున్నారు. కరోనా సమయంలో ఆమె అందించిన సేవలు విశిష్టమైనవి. అంగన్వాడీ కేంద్రాలను సందర్శిస్తూ గర్భిణులకు కానుకలు అందిస్తూ ‘సీమంతం’ నిర్వహిస్తున్నారు. నిరుపేద పిల్లల విద్యాభ్యాసం కోసం ఇటీవలే ఓ పాఠశాలకు రూ.80వేలు విరాళంగా అందజేశారు. మతాలకు అతీతంగా నిర్వహించే పండుగల్లో పాల్గొంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆయేషా ఫాతిమా ఆమేర్.
ఇందూరు క్రీడా మాణిక్యం గుగులోత్ సౌమ్య
ఖలీల్‌వాడి, మార్చి 7 : నిజామాబాద్ జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయిలో అనేక మంది క్రీడాకారులు ఉన్నారు. అందులో ఫుట్‌బాల్ క్రీడాకారిణి గుగులోత్ సౌమ్య అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని ఇందూరు కీర్తిని ప్రపంచానికి చాటింది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ నాగరాజు ఆధ్వర్యంలో ప్రతి టోర్నమెంట్లోనూ ప్రతిభను చాటారు. రెంజల్ మండలం కూనేపల్లి కిషన్ తండాకు చెందిన గోపి-ధనలక్ష్మి దంపతులకు 2001లో జన్మించిన సౌమ్య. 2016లో చైనాలో ఏఎఫ్సీ అండర్-16 ఉమెన్స్ క్వాలీఫైడ్ మ్యాచ్‌లో మెరిట్ సాధించింది. 2017లో ఆదిలాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ సీనియర్ ఉమెన్స్ ఫుట్‌బాల్ టోర్నీలో పాల్గొన్నది. 2017లో జమ్మూకశ్మీర్, 2021లో సౌత్ఆఫ్రికా, 2022లో ఒడిశాలో నిర్వహించిన టోర్నీలో పాల్గొని అద్భుతమైన ప్రతిభ కనబర్చి జిల్లా కీర్తిని చాటింది.
సరోజనమ్మ.. సేవలో మిన్న
శక్కర్‌నగర్, మార్చి 7: సేవ చేసేందుకు వయస్సు అడ్డురాదంటూ నిరూపిస్తోంది బోధన్‌కు చెందిన సరోజనమ్మ. 82 ఏండ్ల వయస్సులో తన సొంత ఇంటిని ఆలిండియా తెలంగాణ విశ్రాంత ఉద్యోగుల, పెన్షనర్ల సంఘం కోసం విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించి గొప్ప మనసు చాటుకున్నారు. అద్దె ఇంట్లో ఉంటూ మృతి చెందిన సంఘటనల్లో వారి భౌతికకాయాలను ఉంచేందుకు నిరాకరిస్తున్న కారణంగా అలాంటి వారికి ఇబ్బంది కలుగకుండా రూ.20లక్షల వ్యయంతో ‘ధర్మస్థల్’ పేరిట రెండు గదులను నిర్మించారు. నిజామాబాద్‌లోని జనరిక్ మెడికల్ షాప్ కోసం రూ. 2లక్షలు విరాళమిచ్చారు. బోధన్‌లోని గ్రంథాలయంలో పుస్తకాల కోసం రూ. 20వేలు వితరణ చేశారు. ఇటీవల రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ సరోజనమ్మను సన్మానించారు కూడా.
అరంగేట్రంతోనే మున్సిపల్ సారథిగా..
కామారెడ్డి,మార్చి 7: కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా నిట్టు జాహ్నవి తనదైన శైలిలో పాలన సాగిస్తూ అందరి మన్ననలను పొందుతున్నారు. పురుషులు మాత్రమే రాజకీయాల్లో రాణిస్తున్న క్రమంలో మహిళలు కూడా రాణిస్తారని నిట్టు జాహ్నవి నిరూపించారు. కామారెడ్డి జిల్లా ఏర్పడిన తర్వాత నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో 33వ వార్డు కౌన్సిలర్‌గా విజయం సాధించి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్ రావు- కరుణశ్రీ ఏకైక కుమార్తె నిట్టు జాహ్నవి. డిగ్రీ చదివిన అనంతరం మూడేండ్లపాటు సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. 2020లో కామారెడ్డి చైర్పర్సన్ స్థానాన్ని మహిళలకు కేటాయించడంతో తండ్రి నిట్టు వేణుగోపాల్ రావుని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కౌన్సిలర్‌గా గెలిచి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు.
కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ఇంట్లో ఉండకుండా బయటికి వచ్చి ప్రతి ఒక్కరికీ వైరస్‌పై అవగాహన కల్పించారు. ఎలాంటి రాజకీయ అనుభవనం లేకున్నా తండ్రిని ఆదర్శంగా తీసుకొని పరిపాలన సాగిస్తూ అందరి మన్ననలను పొందుతున్నది. 2022లో హైదరాబాద్‌కు చెంది వ్యాపారవేత్తను జాహ్నవి వివాహం చేసుకోగా జనవరిలో పండంటి పాపకు జన్మనిచ్చింది. అదే నెలలో ముసాయిదాను రద్దు చేసే సమావేశానికి చంటి పాపను వదిలి మున్సిపల్ సమావేశంలో పాల్గొని ఓర్పుగా తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు.
అత్త ప్రోత్సాహంతో మేయర్‌గా..
ఖలీల్‌వాడి, మార్చి 7 : అత్తమ్మ స్ఫూర్తితో దండు నీతూకిరణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2020లో కార్పొరేటర్‌గా ఎన్నికై నిజామాబాద్ మేయర్‌గా కొనసాగుతున్నారు. నగరానికి చెందిన హరిదాస్ పెంటయ్య-అనసూయ దంపతుల మూడో సంతానం నీతూ కిరణ్. ప్రైమరీ విద్య గీతా కాన్వెంట్లో, ఉన్నత విద్య కోటగల్లి గర్ల్స్ హైస్కూల్లో, ఇంటర్ కోటగల్లి గర్ల్స్ కాలేజీలో, డిగ్రీ ఉమెన్స్ కళాశాలలో పూర్తి చేశారు. అన్నయ్యలు దత్తాద్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సూపర్వైజర్గా, రాజేశ్వర్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. నీతూకిరణ్కు 1991లో దండు చంద్రశేఖర్‌తో వివాహం కాగా, వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అత్తమ్మ అనసూయ పదేండ్ల పాటు కౌన్సిలర్‌గా పనిచేసిన అనుభవం ఉండడంతో కోడలిని ప్రోత్సహించి కార్పొరేటర్‌గా గెలిపించారు. అనంతరం నీతూకిరణ్ బీజేపీతో పోటీపడి మేయర్ పదవిని దక్కించుకున్నారు. అప్పటి నుంచి నగర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా సహకారంతో నిజామాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
ప్రొఫెసర్ టూ చైర్పర్సన్
ఆర్మూర్, మార్చి7: ఉన్నత కుటుంబానికి చెందిన ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినితా పవన్ రాజకీయాల్లో రాణిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నది. ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఎంటెక్ చదివిన వినితా పీహెచ్‌డీని సైతం పూర్తిచేశారు. అటు తర్వాత ఆర్మూర్ మండలం పెర్కిట్‌లోని క్షత్రీయ ఇంజినీరింగ్ కళాశాలలో పదేండ్లపాటు అసోసియెట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. అనంతరం 2019లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆర్మూర్ పట్టణంలోని 33వ వార్డు నుంచి బీఆర్ఎస్ కౌన్సిలర్‌గా ఎన్నికైన వినితా అటు తర్వాత కౌన్సిలర్ల మద్దతుతో ఆర్మూర్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఉన్నత విద్యావంతురాలైన వినితా ఆర్మూర్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు.
ప్రజాసేవ కోసం.. పద్మావతి..
బోధన్, మార్చి 7: ప్రజాసేవ చేయాలన్న బలమైన తపనతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు… ప్రస్తుతం బోధన్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఉన్న తూము పద్మావతీశరత్రెడ్డి. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికలు ఆమెకు ప్రజాసేవ చేసే భాగ్యాన్ని కలిగించాయి. బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ స్థానం మహిళలకు రిజర్వు కావడంతో పద్మావతి కౌన్సిలర్‌గా పోటీచేసి గెలుపొందారు. అదే ఎన్నికల్లో ఆమె భర్త శరత్ రెడ్డి కూడా కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలిచారు. కౌన్సిలర్ల ఎన్నికల అనంతరం చైర్పర్సన్ పదవికి జరిగిన ఎన్నికల్లో పద్మావతి చైర్‌పర్సన్‌గా గెలుపొంది ప్రజాసేవలోకి అడుగుపెట్టారు. గ్రాడ్యుయేషన్ చదివిన పద్మావతి బోధన్ పట్టణ ప్రజల సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతున్నారు. నిత్యం వార్డుల్లో పర్యటిస్తూ అభివృద్ధి పనుల పురోగతిని పర్యవేక్షిస్తూ.. మహిళా ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పద్మావతి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నది. మామ పెద్దారెడ్డి అనేక దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. పద్మావతికి ఇద్దరు కుమార్తెలు.. మనస్వి.. పూర్వీ.
జాతీయ ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీగా నేరల్..
గాంధారి, మార్చి 7: మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపిస్తున్నారు కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని నేరల్ గ్రామ మహిళలు. ఒకవైపు తమ కుటుంబంతోపాటు మరో వైపు గ్రామాన్ని సైతం చక్కదిద్దుకుంటున్నారు. నేరల్ గ్రామంచాయతీ పాలకవర్గంలో సర్పంచ్, ఉప సర్పంచ్‌తోపాటు 70శాతం మహిళలే ఉన్నారు. ప్రజాప్రతినిధులుగా, మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉంటూ గ్రామంతోపాటు తమ కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసుకుంటున్నారు. గ్రామంలో ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనులకు, చేపడుతున్న కార్యక్రమాలకు ఇటీవల జాతీయ ఉమెన్ ఫ్రెండ్లీ ఉత్తమ పంచాయతీగా అవార్డుకు ఎంపికయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకాన్నీ వందశాతం విజయవంతం చేస్తున్నారు. పల్లె ప్రగతి, విద్యా, వైద్యంలో ముందున్నారు. గ్రామంలో ప్లాస్టిక్‌ను నిషేధించేందుకు జీపీ ఆధ్వర్యంలో జూట్ బ్యాగులను తయారు చేయించి ఇంటింటికీ అందజేశారు.
మహిళామూర్తి కష్టం.. అమాత్యుడినిఇచ్చింది
కమ్మర్పల్లి, మార్చి 7: కుటుంబంలో మహిళల పాత్ర వెలకట్టలేనిది. కుటుంబంలో మహిళల శ్రమ ఆ కుటుంబానికి ఉత్తమ ఫలితాలు అందించిన వైనాలు ఎన్నో ఉంటాయి. అలాంటి వైనమే రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాతృమూర్తి మంజులమ్మది. ప్రశాంత్‌రెడ్డి తండ్రి వేముల సురేందర్ రెడ్డి ఎకరాల కొద్దీ భూములున్న మోతుబరి. తనలో ఉన్న నిజాయతీ గల నాయకత్వ లక్షణాలు, ప్రజలు, రైతుల కోసమే ఆలోచిస్తూ వారికోసం పనిచేశారు. తన భూములు, ఆస్తులు కర్పూరంలా కరిగిపోయినా తన నిజాయతీ నాయకత్వాన్నే కొనసాగించారు. ఈ పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో పడిన తమ కుటుంబాన్ని సురేందర్‌రెడ్డి సతీమణి ఎంతో శ్రమతో కష్టపడి ముందుకు నడిపారు. భర్త ఆశయాలను సంపూర్ణంగా గౌరవిస్తూనే, ఆయన నాయకత్వాన్ని ఇల్లాలిగా ఇనుమడింపజేస్తూనే మరో పక్క కుటుంబ ఆర్థిక ఇబ్బందులు బయట పడకుండా గుంబనంగా శ్రమించిన మహిళామూర్తి ఆమె. ఇంట్లో ఉండే పాడి పశువులనే నమ్ముకొని..
అవి ఇచ్చే పాలే ఆదాయంగా వచ్చిన డబ్బులను పొదుపుగా వాటినే మదుపుగా వాడుతూ కుటుంబభారంలో పాలుపంచుకున్నారు. సురేందర్‌రెడ్డి తల్లి గారితో కలిసి ఆమె శ్రమ పడుతూ కుటుంబానికి అండగా నిలవడం… వారి పిల్లలు చదువులపై మనసు పెట్టడానికి దోహదం చేసింది. ఈ క్రమంలో ఆ కుటుంబం నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంజినీరింగ్ పూర్తిచేసి హైదరాబాద్‌లో బిల్డర్‌గా రాణించి తన తండ్రి ఆశయాలను సాధించే లక్ష్యంతో నాయకుడిగా వచ్చి మంత్రిగా ఎదిగారు. రెండో కుమారుడు అజయ్ రెడ్డి, కూతురు రాధికారెడ్డి ఉన్నతోద్యోగాలు సాధించారు. ఒక కుటుంబంలో మహిళలు పడే శ్రమ ఆ కుటుంబసభ్యుల గొప్ప ఉన్నతికి కూడా దోహదం కావచ్చు అనడానికి మంత్రి వేముల తల్లి శ్రమనే నిదర్శనం.
పౌరోహిత్యంలో అక్కాచెల్లెండ్లు
కమ్మర్పల్లి, మార్చి 7: పౌరోహిత్యం పురుషులే చేయాలన్న కట్టుబాట్లు ఉన్న రోజుల్లో వాటిని ధిక్కరించి తన నలుగురు కూతుళ్లనూ మహిళా పురోహితులుగా తీర్చిదిద్దాడు కమ్మర్పల్లి మండలం చౌట్పల్లికి చెందిన కాశీరాం జోషి పంతులు. ఫలితంగా ఈ నలుగురు అక్కాచెల్లెండ్లు ఏండ్ల నుంచి వందలాది పెండ్లిళ్లు, శుభకార్యాల్లో పౌరోహిత్యం చేశారు. కాశీరాం జోషి పంతులుకు మగ సంతానం లేదు. నలుగురూ కూతుళ్లే. పెద్ద కూతురు ప్రణవేశ్వరి, రెండో కూతురు రాజేశ్వరి, మూడో కూతురు భవనేశ్వరి, నాలుగో కూతురు జ్ఞానేశ్వరి. వీరిని మగవారితో సమానంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో వారికి పౌరోహిత్యం నేర్పించాడు. స్త్రీలు ఎక్కడ గౌరవింపబడతారో..అక్కడ దేవతలు కొలువై ఉంటారని నమ్మిన కాశీరాం జోషి 1972లో సికింద్రాబాద్‌లోని సర్వసమాజ్ నిర్వాహకుడు పండిత్ నరేంద్రజీని చౌట్పల్లికి ఆహ్వానించి మరి తన కూతుళ్లకు ఉపనయనం చేయించాడు. తండ్రి చూపిన వేదబాటలో ఈ నలుగురు అక్కాచెల్లెండ్లు వందల శుభకార్యాలు, పెండ్లిళ్లు చేస్తూ మహిళా పురోహితులుగా రాణిస్తున్నారు.
అందరూ మహిళలే..
డిచ్పల్లి, మార్చి 7: డిచ్పల్లి మండలంలోని యానంపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గసభ్యులంతా మహిళలే. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులందరూ మహిళలు కావడం విశేషం. చివరికి గ్రామానికి చెంది న ఎంపీటీసీ(ప్రస్తుత జడ్పీటీసీ), పంచాయతీ కార్యదర్శి కూడా మహిళే ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఏ గ్రామంలో కూడా ఇలాంటి ప్రత్యేకత లేకపోవచ్చు. సర్పంచ్ సహా పది వార్డులకు తొమ్మిది వార్డుల్లోనూ మహిళలే విజయం సాధించారు. ఒక్క వార్డులో మాత్రం పురుషుడు గెలుపొందగా.. అయితే ఆ ఒక్క పదవిని కూడా మహిళకే అందించాలన్న ఉద్దేశంతో ఆ వ్యక్తి విజయం సాధించిన మరుక్షణమే తన పదవికి రాజీనామా చేశారు. పంచాయతీ పాలకవర్గాన్ని పూర్తిగా మహిళలతో నింపాలన్న ఆలోచనకు అందరినీ ఒప్పించడంలో ఎంపీటీసీ, ప్రస్తుత జడ్పీటీసీ దాసరి ఇందిరాలక్ష్మీనర్సయ్య సఫలమవ్వడం విశేషం.