Nizamabad | వినాయక నగర్, జనవరి 10 : భారతీయ చరిత్రలో అత్యంత పవిత్రమైన సోమనాథ్ పుణ్యక్షేత్రం పై 1026 జనవరిలో గజిని మహమ్మద్ చేసిన క్రూరమైన దాడికి వెయ్యేళ్లు పూర్తవుతున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.
వినాయక నగర్ మండలం కోటగల్లిలోని శ్రీ భక్త మార్కండేయ ఆలయంలో BJYM రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్నాటి కార్తీక్ ఆధ్వర్యంలో శనివారం ఆలయాన్ని శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తీక్ మాట్లాడుతూ ఆనాడు విదేశీ ఆక్రమణదారులు సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసినప్పటికీ ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా నేడు ఆ క్షేత్రం అత్యంత వైభవంగా వెలుగొందుతోందని అన్నారు.
ఆలయ పునరుద్ధరణ జరిగి 2026 నాటికి 75 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో మన చారిత్రక కట్టడాలను, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందన్నారు. కోటగల్లిలోని మార్కండేయ ఆలయ ప్రాంగణాన్ని కాలనీవాసులతో కలిసి శుద్ధి చేసిన అనంతరం, స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. సనాతన ధర్మంపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు స్ఫూర్తినిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇపకాయల కిషోర్, దోర్నాల రవి, వాసం జయ, బల్ల లక్ష్మి, పల్నాటి శ్రీలక్ష్మి, కార్యకర్తలు, కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.