ఎల్లారెడ్డి రూరల్, జనవరి 29: ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 16మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా, దవాఖానకు తరలించి చికిత్స అందించారు. బుధవా రం చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలు.. రోజు మాదిరిగానే విద్యార్థులకు ఏజెన్సీ నిర్వాహకులు మధ్యాహ్న భోజనాన్ని వండి పెట్టారు. భోజనం ముగిసిన గం ట తర్వాత విద్యార్థులకు కడుపునొప్పిరావడం, వాంతులు చేసుకొని అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
16మంది విద్యార్థులకు వైద్యులు చికిత్స అందించగా, సాయంత్రం వరకు కోలుకున్న కొందరిని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. నలుగురు విద్యార్థులు మాత్రం దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఏజెన్సీ నిర్వాహకురాలు మధ్యాహ్నం వండిన టమాట కూర తిన్న తరువాతే తాము అస్వస్థతకు గురైనట్లు విద్యార్థులు చెబుతున్నారు. టమాట కూరలో నాణ్యతలేకపోవడంతో అస్వస్థతకు గురైనట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.