నవీపేట/ నందిపేట్/కంఠేశ్వర్, సెప్టెంబర్ 8: వినాయక నిమజ్జనోత్సవంలో భాగంగా ఎనిమిది ఫీట్ల కన్నా తక్కువ ఎత్తులో ఉన్న విగ్రహాలను బాసర వైపు, భారీ విగ్రహాలను ఉమ్మెడ గోదావరి నది వైపు తరలించనున్నట్లు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. మంగళవారం ఆయన సీపీ కల్మేశ్వర్‌తో కలిసి నవీపేట మండలంలోని యంచ గోదావరి, నందిపేట్ మండలంలోని ఉమ్మెడ గోదావరి నది వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులతో చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ఐదు క్రేన్లు, లైటింగ్ ఏర్పాట్లతోపాటు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు.
జాన్కంపేట, నవీపేట రైల్వేగేటు వద్ద ఎలక్ట్రికల్ లైన్స్ కారణంగా ఎనిమిది ఫీట్ల లోపు ఉన్న వినాయక విగ్రహాలను నవీపేట మీదుగా యంచ గోదావరి నదికి తరలించేందుకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. 8 ఫీట్ల కన్నా పెద్ద విగ్రహాలను నందిపేట్ మండలం ఉమ్మెడ గోదావరి వద్దకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
దూర ప్రాంతాల నుంచి వచ్చే మండపాల నిర్వాహకులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. నిమజ్జనం నేపథ్యంలో యంచ వంతెనపై వన్ వే ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, నిజామాబాద్ ఆర్డీవో రాజేందర్‌కుమార్, నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ సతీశ్‌కుమార్, ఎస్సై కే. వినయ్ ఆయా శాఖల అధికారులు ఉన్నారు.