మోర్తాడ్, డిసెంబర్ 4: ఇసుక అక్రమ దందాలో చోటుచేసుకుంటున్న వ్యవహారాలు విస్తుగొల్పుతున్నాయి. ట్రిప్పుల లెక్కల్లో తప్పులు చూపించారని వీడీసీతోపాటు మరికొందరికి రూ.2 లక్షల జరిమానా విధించిన ఉదంతం శెట్పల్లిలో చోటు చేసుకున్నది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి విశ్వసనీయంగా తెలిసిన వివరాల ప్రకారం.. గ్రామశివారులోని పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలించేందుకు వీడీసీతో అధికార పార్టీ నేతలు ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఇందుకు గాను ఒక్కో ట్రాక్టర్ ఇసుకకు వీడీసీకి రూ.2 వేలు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. అలాగే, ఇసుక తరలింపు విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారులను సంబంధిత వ్యక్తులే చూసుకోవాల్సి ఉంటుందని నిర్ణయించుకున్నారు. రోజువారీగా తరలిస్తున్న ఇసుక ట్రిప్పులను వీడీసీ సభ్యులే దగ్గరుండి నమోదు చేసుకుంటారు. ఈ క్రమంలోనే కొందరు సభ్యులు, ట్రాక్టర్ డ్రైవర్లు కుమ్మక్కై ట్రిప్పుల సంఖ్యను తక్కువగా నమోదు చేశారు. ఇలా ఒక్కో ట్రిప్పుకు రూ.2 వేల చొప్పున మిగుల్చుకుని, ఆ డబ్బును సంబంధిత సభ్యులు, డ్రైవర్లు పంచుకుంటున్నారు.
ఈ విషయం బయటికి రావడంతో మంగళవారం గ్రామస్తులు పంచాయితీ పెట్టారు. లెక్కల్లో తప్పులు చూపినందుకు బాధ్యులకు రూ.2 లక్షల జరిమానా విధించాలని నిర్ణయించారు. ఆ డబ్బులు చెల్లించిన తర్వాతే ఇసుక తవ్వకాలు మొదలు పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. అక్రమ ఇసుక తవ్వకాలు గ్రామాల్లో చిచ్చుపెడుతున్నా, జరిమానాలకు దారి తీస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది.