ప్రైవేట్ స్కూళ్లు కొన్ని విచ్చలవిడి దోపిడీకి తెర లేపాయి. ఇష్టానుసారం ఫీజుల పెంపుతో పాటు బుక్స్, యూనిఫామ్స్, ఇతర సామగ్రి విక్రయిస్తూ తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రైవేట్ విద్యాసంస్థలు ఫక్తు వ్యాపార సంస్థలుగా మారాయి. బుక్స్, యూనిఫామ్స్, షూస్ సహా అన్నీ అక్కడే విక్రయిస్తున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభం కావడమేమో కానీ ఆయా స్కూళ్ల బాదుడు భరించలేక విద్యార్థుల తల్లిదండ్రులు బెంబేలెత్తుతున్నారు. ప్రైవేట్ యాజమాన్యాల దోపిడీని నియంత్రించాల్సిన విద్యాశాఖ అటువైపు కన్నెత్తి చూడడం లేదు. బడుల్లోనే యథేచ్ఛగా బుక్స్, యూనిఫామ్స్, షూస్, ఇతరత్రా వస్తువులు విక్రయిస్తున్నా తనిఖీలు చేపట్టడం లేదు.
-ఖలీల్‌వాడి, జూన్ 17
ఉమ్మడి జిల్లాలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చేశాయి. ధనార్జనే లక్ష్యంగా పని చేస్తున్న ఆయా స్కూళ్లు.. ఏ చిన్న అవకాశాన్ని వదిలి పెట్టడం లేదు. ఏటేటా ఇష్టానుసారం ఫీజులు పెంచేస్తూ తల్లిదండ్రులపై పెనుభారం మోపుతున్నాయి. ప్రవేశాల సమయంలో రకరకాల పేర్లతో పాటు అడ్మిషన్ ఫీజుల రూపంలోనూ దండుకుంటున్నాయి. ఒక్కో స్కూల్లో ఒక్కో రకమైన ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ స్థాయిలోనే రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు గుంజుతున్నాయి. హాస్టల్ వసతి ఉన్న పాఠశాలల్లో అయితే దోపిడీకి అంతే లేకుండా పోయింది.
దుకాణాలను తలపిస్తున్న స్కూళ్లు
ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. అయితే సోమవారం నుంచే విద్యార్థులు స్కూళ్లకు రావడం మొదలైంది. ఇదే అదనుగా ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయి. గతేడాది కంటే ఈసారి రూ.20 వేలకు పైగానే ఫీజులు పెంచారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇక, విద్యాసంస్థలను వ్యాపార సంస్థలుగా మార్చి.. విద్యార్థులకు అవసరమైన సామగ్రిని బడుల్లోనే విక్రయిస్తున్నారు. పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫామ్స్, షూస్ స్కూళ్లలోనే అమ్ముతున్నారు. తమ వద్దే కొనాలని తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు.. బయటి మార్కెట్ కంటే అధిక ధరకు విక్రయిస్తూ దోచుకుంటున్నాయి.
ఒకటో తరగతి బుక్స్ ధర రూ.7 వేల నుంచి రూ.8 వేలకు అంటగడుతుండడం దోపిడీకి నిదర్శనంగా నిలుస్తున్నది. ఇక, పాఠశాల బ్లేజర్ పేరిట ఐదారు వేల రూపాయలు దండుకుంటున్నారు. ఇక హాస్టల్ వసతి ఉన్న ప్రైవేట్ స్కూళ్లలో అయితే ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. స్కూల్ యూనిఫామ్స్‌తో పాటు సాయంత్రం వేసుకునే దుస్తులు కూడా తమ వద్దే కొనాలని ఒత్తిడి చేస్తున్నారు. నగర శివార్లలో ఉన్న కొన్ని స్కూళ్లలో నవ్యపథంలో దోపిడీకి తెర లేపారు. విద్యాబోధనపై కాకుండా అనవసరపు హంగుల పేరిట తల్లిదండ్రులపై అదనపు భారం మోపుతున్నారు. బ్రాండెడ్ షూస్ మాత్రమే అనుమతిస్తామని, అవి కూడా తమ వద్దే కొనాలని ఒత్తిడి చేస్తుండడం దోపిడీకి పరాకాష్టగా మారింది. ఒకప్పుడు పాఠశాలలు ప్రారంభమవుతుంటే బుక్ స్టాల్స్ కళకళలాడేవి. స్కూళ్లలోనే అన్ని విక్రయిస్తుండడంతో ఇప్పుడవన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి.
అనుమతి లేని స్కూళ్లపై చర్యలేవి?
ప్రైవేట్ స్కూళ్లలో విచ్చలవిడి దోపిడీ జరుగుతున్నా విద్యాశాఖ స్పందించడం లేదు. ఆయా బడుల్లో తనిఖీలు చేయడం లేదు. మరోవైపు, అనుమతి లేని స్కూళ్లపై చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖ విఫలమవుతునందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతి లేని బడుల్లో చేరొద్దని ప్రకటన చేసి చేతులు దులుపుకుంటున్న విద్యాశాఖ అధికారులు.. అసలు జిల్లాలో ఎన్ని స్కూళ్లకు అనుమతి ఉంది, ఎన్నింటికి అనుమతి లేదనే వివరాలను మాత్రం బయటికి వెల్లడించడం లేదు. మరోవైపు, అనుమతి లేని పాఠశాలలను ఎందుకు సీజ్ చేయడం లేదని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో జరుగుతున్న దోపిడీని ఎందుకు నియంత్రించడం లేదని నిలదీస్తున్నారు.
కనీసం ఒక్క స్కూల్లో అయినా ఎందుకు తనిఖీ చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. చాలా పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఇరుకు గదుల్లో పాఠాలు బోధిస్తున్నాయి. అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నా, స్కూళ్లలోనే విక్రయాలు జరుపుతున్నా, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న స్కూళ్లపై విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టక పోవడం విస్మయానికి గురి చేస్తున్నది. జిల్లాలో జరుగుతున్న ప్రైవేట్ పాఠశాలల దోపిడీపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా డీఈవో అందుబాటులోకి రాలేదు. అధిక ఫీజులు, పాఠ్యపుస్తకాలు అమ్మకాలపై వివరణ కోసం ఫోన్ చేయగా, లిప్ట్ చేయలేదు.
యూనిఫామ్స్, పుస్తకాల విక్రయాలను అడ్డుకోవాలి
ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతి పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, టై బెల్ట్ విక్రయిస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. తల్లిదండ్రులపై అధికభారం మోపుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవడంలేదు. పాఠశాలల్లో నోటు పుస్తకాల విక్రయాలను అడ్డుకోవాలి.
-అభిలాష్‌రెడ్డి, ఆర్మూర్ యువజన సంఘం నాయకుడు