నమస్తే యంత్రాంగం, జూలై 29: పుడమి పులకించింది.. రైతాంగం మురిసింది.. రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తడిసి ముద్దయింది. మంగళవారం మొదలైన వాన బుధవారం రోజంతా కొనసాగింది. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లగా, చెరువుల్లోకి కొత్త నీరు వచ్చి చేరుతున్నది. ప్రధాన జలాశయాల్లోకి వరద కొనసాగుతున్నది. వానాకాలం ప్రారంభమై రెండు నెలలు సమీపిస్తున్నా ఇప్పటిదాకా పెద్దగా వర్షాలు కురియలేదు. దీంతో ఉమ్మడి జిల్లా రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సాగునీరందక వాడిపోతున్న పంటలకు తాజా వర్షాలు ఊపిరి పోశాయి. రెండ్రోజులుగా జోరుగా కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలుచోట్ల రహదారులు కోతకు గురయ్యాయి.
నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా మెండోరాలో 11.56 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. మోపాల్‌లో 11.24 సెం.మీ., నవీపేట్లో 11.20, మోస్రాలో 10.9, డిచ్‌పల్లిలో 10.6 సెం.మీటర్ల వర్షం కురిసింది. అత్యల్పంగా బాల్కొండ, జక్రాన్‌పల్లి, వర్ని, భీమ్‌గల్, నందిపేట్, కోటగిరి మండలాల్లో 50 మి.మీటర్ల కంటే తక్కువగా వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. జిల్లాలో 79.69 మి.మీ సగటు వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు.

13
ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల్లోకి ఇన్‌ఫ్లో పెరుగుతుండడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు 4,051 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, నిజాంసాగర్‌కు 6,585 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు(80.5 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1065.30 అడుగుల (16.405 టీఎంసీల) నీటి నిల్వ ఉన్నది. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు (17.80 టీఎంసీల)కు గాను 1391.25 అడుగులు (7.13 టీఎంసీల)కు చేరింది. కౌలాస్ ప్రాజెక్టులోకి 740 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. కల్యాణి వాగు ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. భారీగా వస్తున్న వరదతో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరింది. 430 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో రెండు రేడియల్ గేట్ల ద్వారా 250 క్యూసెక్కులు మంజీరా నదిలోకి, 180 క్యూసెక్కులను నిజాంసాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కాలువలోకి మళ్లించారు. పోచారం ప్రాజెక్టులోకి 200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. డెడ్ స్టోరేజ్‌గా ఉన్న పోచారంలోకి రెండు రోజుల్లోనే 9.5 అడుగులు నీరు వచ్చి చేరింది.
రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, వాగులు జల కళను సంతరించుకున్నాయి. బాన్సువాడ -ఎల్లారెడ్డి ప్రధాన రహదారి వద్ద చెదలవాగుకు, కొల్లూరు వాగు, అవాజ్పల్లి మత్తడికి భారీగా వదర నీరు రావడంతో నిండుగా ప్రవహిస్తున్నాయి. బోర్లం, తాడ్కోల్, ఇబ్రహీంపేట్ చెరువులకు భారీ వరద రావడంతో జలకళను సంతరించుకున్నాయి. కొయ్యగుట్ట శివారులో పంట పొలాలు నీట మునిగాయి. పల్వంచ మండల కేంద్రంలో ఉన్న పల్వంచ వాగు నిండుగా ప్రవహిస్తున్నది. నవీపేట మండలంలో జన్నేపల్లి వాగు, మాటు కాల్వ పొంగి పొర్లాయి.

సంగారెడ్డి జిల్లాలో జోరుగా కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్‌రావ్‌పల్లి చౌరస్తా సమీపంలో ఉన్న నల్లవాగు మత్తడి ఉధృతంగా ప్రవహించింది. పెద్దగుట్ట, గాంధారి తదితర మండలాల్లో భారీ వర్షాలతో సింగీతం వాగు పొంగి పొర్లింది. సింగీతం ప్రాజెక్టు జలకళ ను సంతరించుకున్నది. దోమకొండ మండలంలోని ఎడ్ల కట్ట వాగు ఉధృతంగా ప్రవహించింది.
వర్షాకాలం ఆరంభమై దాదాపు రెండు నెలలు గడుస్తున్నా పెద్దగా వర్షాలు కురియలేదు. దీంతో రైతాంగం తీవ్ర ఆందోళనకు గురైంది. ఇప్పటికే మక్క, పసుపు, పత్తి, సోయాతో పాటు వరినాట్లు వేసిన అన్నదాతలు ఆందోళనకు గురయ్యారు. పంటలు కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. ప్రాజెక్టులు, చెరువుల్లోని నీళ్లు, భూగర్భ జలాలు అడుగంటి సాగునీరు అందక పంటలు వాడిపోయి తీవ్ర ఆవేదన చెందారు. అయితే, రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు పంటలకు ఊపిరి పోశాయి. దీంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.