Haldi function | వివాహ వేడుకల్లో హల్దీ ఫంక్షన్ ఇప్పుడు కొత్త ట్రెండ్.. పెండ్లికి ఒకరోజు ముందుగా వధూవరులకు పసుపుతో మంగళస్నానాలు చేయించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే మంగళస్నానం అనే ఆచారం 2018 చివరి నుంచి కొత్తపుంతలు తొక్కి హల్దీ ఫంక్షన్‌గా మారి మ్యారేజ్ ఈవెంట్లో ప్రత్యేకతను సంతరించుకున్నది. పెండ్లిళ్లలోప్రస్తుతం హల్దీ ఫంక్షన్ వేడుకలు ఎప్పుడూ గుర్తుండిపోయేలా ప్రత్యే క ఆకర్షణగా నిలుస్తున్నాయి. హల్దీ ఈవెంట్లో పెండ్లి కూతు రు, పెండ్లి కొడుకు బంధువులు, స్నేహితులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మ్యారేజీలో ఇప్పుడు మంగళస్నానం మరుపురాని మధురానుభూతిని అందిస్తున్నది.
కండ్లు చెదిరేలా షూట్స్..
హల్దీ ఫంక్షన్ వేడుకల్లో ఫొటో, వీడియో షూట్ క్రేజీగా మారింది. ఉత్సాహంగా సాగే హల్దీ ఈవెంట్‌ను జీవితాంతం గుర్తుండేలా ఫొటో, వీడియోగ్రాఫర్లు షూట్ చేస్తున్నారు. ఫొటో, వీడియో షూటింగ్‌లకు సైతం పెద్ద మొత్తంలో చార్జ్ చేస్తున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా హల్దీవేడుకలు..
పెండ్లిలో హల్దీ ఫంక్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెండ్లి కొడుకుకు పసుపు రాసి .. బంధువులు, స్నేహితులు అందరూ పసుపు రాసుకొని మంగళస్నానం చేయించడం మరుపురాని అనుభూతి, కొందరు బిందెలతో నీళ్లు పోయడం.. మొత్తం ఫంక్షన్లో ఎంజాయ్మెంట్.. హంగామా.. హుషారుగా గడిచింది.
రూ.10వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు..
హల్దీ వేడుకల ఈవెంట్స్ కోసం ప్రత్యేక సెట్టింగ్‌లు అందుబాటులోకి వచ్చాయి. రూ.10 వేల నుంచి రూ.50వేల వరకు సెట్టింగ్‌లకు చార్జ్ చేస్తున్నట్లు ఈవెంట్స్ నిర్వాహకులు పేర్కొన్నారు. హల్దీ ఫంక్షన్లో పెండ్లి కూతురు కూర్చోడానికి తామరపువ్వు, పెళ్లి కుమారుడికి బాహుబలి తోఫా సెట్టింగ్ వేస్తారు. గులాబీ, మల్లె, చామంతి రకరకాల పూలతో డెకొరేట్ చేస్తారు. మంగళస్నానాలకు గంగాళాలు,జల్లెడ, రాగి లేదా ఇత్తడి చెంబు వాడుతారు. కపుల్స్ పసుపు రాసిన అనంతరం గంగాళంలో పూలతో ఉన్న పసుపు నీళ్లను జల్లెడ ద్వారా పోసి చిరుజల్లులతో మంగళస్నానం చేయిస్తారు.
డ్రెస్‌కోడ్‌తో వేడుకలు..
హల్దీ ఫంక్షన్లలో ఒకే రకమైన డ్రెస్‌కోడ్‌తో పాల్గొంటున్నారు. మగవారు మెజార్టీగా పసుపు కలర్ పైజామా ధరిస్తారు. మహిళలు పసుపు కలర్ చీరెలు ధరిస్తారు. ఇంకొంతమంది మెరూన్, బ్లూ, ఆరెంజ్ తదితర రంగుల డ్రెస్సింగ్ కోడ్‌ను వాడుతున్నారు. పెండ్లి కూ తురు, పెండ్లి కుమారుడికి ఎవరి ఇండ్లలో వారు వేర్వేరుగా వేడుకలు నిర్వహిస్తారు. పసుపు నీటితో మంగళస్నానం చేయిస్తారు.
హల్దీతో చెప్పలేని ఆనందం
ఇటీవల నా వివాహం జరిగింది. హల్దీ ఫంక్షన్లో బంధువులు,స్నేహితులు కలిసి ఒకే కలర్ డ్రెస్ కోడ్‌తో ఉత్సాహంగా పాల్గొనడం చెప్పలేని ఆనం దాన్ని ఇచ్చింది. వరసైన వారు చేసే అల్లరి, కొంటె పనులతో వేడుకలు జీవి తంలో మరచిపోలేని మధురానుభూతిని ఇచ్చాయి.
– సుమన్, రాంపూర్
ఉత్సాహాన్నిస్తాయి…
వివాహ వేడుకల్లో హల్దీ ఫంక్షన్ ప్రత్యేకంగా మారింది. దీంతో వేడుకల్లో ఫొటో,వీడియో రికార్డింగ్ ప్రాముఖ్యత సంతరించుకున్నది. ఇప్పటి వరకు 80 వరకు హల్దీ ఈవెంట్స్, ఫొటో,వీడియోగ్రఫీ చేశాను. హల్దీ వేడుకల షూట్స్ కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి.
– బర్ల విజయ్‌కుమార్,ఫొటో గ్రాఫర్, కోటగిరి
అదిరిపోయేలా సెట్టింగ్స్
హల్దీ ఫంక్షన్ సెట్టింగ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వేడుకలకు ప్రత్యేక అందం తెచ్చేలా సెట్టింగ్‌లు వేస్తున్నాం. గ్రామాల్లో హల్దీ ఫంక్షన్ సెట్టింగ్‌కు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. పట్టణాల్లో హల్దీ వేడుకల సెట్టింగులు రూ.20 నుంచి రూ.50 వేల వరకు ఉంటుంది. ఇప్పటి వరకు సుమారు 60 వరకు హల్దీ సెట్టింగులు వేశాం.
– మీర్ల సతీశ్, ఈవెంట్స్, కోటగిరి