జాతీయ కృతిమ గర్భధారణ కార్యక్రమం(ఎన్ఏఐపీ) నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో విజయవంతంగా కొనసాగుతున్నది. పాడి పశువులకు మేలు జాతి దూడలు జన్మించేందుకు కృత్రిమ గర్భధారణ ఎంతగానో దోహదపడుతుంది. పాడి రైతులకు రెట్టింపు ఆదాయం సమకూర్చడంతోపాటు పశు సంపదను పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కృతిమ గర్భధారణ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి.
నిజామాబాద్ రూరల్,జనవరి 11
ఎదకు రాని పాడి పశువులకు రైతుల ఇంటివద్దనే ఉచితంగా కృతిమ గర్భధారణ చేపట్టి ఎదకు వచ్చేలా చేయడంలో గోపాలమిత్రలు, పశు సంవర్ధకశాఖ సాంకేతిక సిబ్బంది ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. పశువులకు కృత్రిమ గర్భధారణ నిర్వహించేందుకు అవసరమైన ఘనీకృత వీరిస్, లిక్విడ్ నైట్రోజన్ తదితర సామగ్రిని జిల్లా పశుగణాభివృద్ధి సంఘం(డీఎల్డీఎ) అందజేస్తున్నది. ఎదకు రాని పాడి పశువులకు ఉచితంగా కృతిమ గర్భధారణ చేపట్టేందుకు జిల్లా పశుగణాభివృద్ధి సంఘానికి ప్రభుత్వం ప్రతి యేడాది లక్ష్యాన్ని నిర్ధేశిస్తుంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ నగర పరిధిలోని సారంగాపూర్ శివారులో జిల్లా పశు గణాభివృద్ధి సంఘం కేంద్రంగా ఉభయ జిల్లాల్లో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నది.
ఒక్కో జిల్లాకు తొలి విడుతగా 100 గ్రామాలను ఎంపిక చేసుకొని, ఒక్కో గ్రామంలో ఎదకు రాని 200 పశువులకు ఉచితంగా కృత్రిమ గర్భధారణ చేసి ఎదకు వచ్చేలా కృషి చేశారు. ప్రభుత్వం నిర్ధేశించిన కృతిమ గర్భధారణ లక్ష్యసాధన కోసం ఉమ్మడి జిల్లాల్లో డీఎల్డీఏ, పశుసంవర్ధక శాఖ అధికారులు, గోపాలమిత్రలు, సిబ్బంది సమష్టి కృషి చేస్తున్నారు. దీంతో ఉచిత కృత్రిమ గర్భధారణ ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యానికి మించి చేపట్టారు. గత మూడు విడుతల్లో ఉమ్మడి జిల్లాల్లో మొత్తం లక్షా 66 వేల 984 పాడి పశువులకు కృత్రిమ గర్భధారణ చేశారు. అందులో అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 92,715, నిజామాబాద్ జిల్లాలో 74,269 పాడి పశువులకు కృత్రిమ గర్భధారణ చేపట్టారు. నిజామాబాద్ జిల్లాలో జిల్లా పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ జగన్నాథచారి, డీఎల్డీఏ కార్యనిర్వాహణాధికారి డాక్టర్ శ్రీశైలం, కామారెడ్డి జిల్లాలో జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి డాక్టర్ భరత్, పశు వైద్యాధికారులు ఉచిత కృత్రిమ గర్భధారణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
కృత్రిమ గర్భధారణ ద్వారా కేవలం ఆడదూడలను మాత్రమే పుట్టించే వీర్యం రాష్ట్రంలోనే తొలిసారిగా త్వరలో అందుబాటులోకి రానున్నది. ఎదకు వచ్చినప్పుడు పశువుకు వేసే వీర్యనాళిక ఖరీదు రూ.675 ఉంటుంది. ఇందులో రూ.425 సబ్సిడీ పోను రైతు రూ.250 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. మొదటి విడుతలో కృత్రిమ గర్భధారణ చేసినప్పుడు చూడి నిల్వకపోతే రెండో విడుతలో కూడా వీర్యనాళిక కోసం రూ.250లు రైతు చెల్లించాల్సి ఉంటుంది. అప్పటికైనా కృత్రిమ గర్భధారణ ద్వారా చూడి నిల్వనట్లయితే రైతు రెండుసార్లు చెల్లించిన రూ.500లు తిరిగి చెల్లిస్తారు. ఈ స్కీమ్ కింద పాడి రైతులు తమకున్న పశువుల్లో 3 ఈతల్లోపు ఉన్న పశువులను పశు వైద్యసిబ్బంది, గోపాలమిత్ర వద్ద, ఈ- గోపాల యాప్లో రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని రకాల గేదెలు, ఆవులకు కృత్రిమ గర్భధారణ ద్వారా ఆడదూడలు పుట్టించే కార్యక్రమం త్వరలోనే ప్రారంభం కానున్నది.
ఉమ్మడి జిల్లాలో 2022 ఆగస్టు 1 నుంచి 2023 మే 31 వరకు 4వ విడుత కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని పశుసంవర్ధక శాఖ అధికారులు, గోపాలమిత్రలు చేపడుతున్నారు. ఎదకు రాని పశువులకు 4వ విడుతలో కూడా కృత్రిమ గర్భధారణ నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 16,285 పాడి పశువులకు కృత్రిమ గర్భధారణ చేపట్టడం లక్ష్యం కాగా ఇప్పటి వరకు 13,221 పశువులకు కృత్రిమ గర్భధారణ చేశారు. కామారెడ్డి జిల్లాలో 16,585 పశువులకు కృత్రిమ గర్భధారణ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 14,626 పశువులకు కృత్రిమ గర్భధారణ చేశారు. కృత్రిమ గర్భధారణ చేసే ముందు పాడి రైతులు, పశువు ఆధార్ నంబర్(చెవిపోగు), రైతు ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో 127 మంది గోపాలమిత్రలు విధులు నిర్వహిస్తూ పాడి పశువులకు ఉచితంగా కృత్రిమ గర్భధారణ చేపడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో 1,78,172, కామారెడ్డి జిల్లాలో 1,86,038 గేదెలు, ఆవులు ఉన్నాయి.
ప్రతి రైతు వ్యవసాయంతోపాటు పాడి పశువుల పెంపకంపై ఆసక్తి చూపాలి. పశు సంపద పెంచడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటున్నది. మేలు జాతి పశువులు జన్మించడానికి తద్వారా అధిక పాల దిగుబడి పొందడానికి ప్రభుత్వం చేపడుతున్న కృత్రిమ గర్భధారణ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతున్నది. పశు సంవర్ధక, పశుగణాభివృద్ధి శాఖల అధికారులు, పశు వైద్యులు, సిబ్బంది, గోపాలమిత్రల సమష్టి కృషితో పశు గణాభివృద్ధి సాధించడానికి కృషి చేస్తున్నాం.
– రాజలింగం, చైర్మన్, ఉమ్మడి జిల్లా పశు గణాభివృద్ధి సంఘం
డీఎల్డీఏ కింద ఉన్న నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వం నిర్ధేశించిన ఉచిత కృత్రిమ గర్భధారణ మూడు విడుతల కార్యక్రమంలో లక్ష్యానికి మించి చేపట్టాం. 4వ విడుతలో నిర్ధేశించిన లక్ష్య సాధన కోసం కూడా కృషి చేస్తాం. పాడి రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. చలికాలంలోనే పశువులు ఎక్కువగా ఎదకు వచ్చే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో ఎదకు రాని పశువులను గుర్తించి వాటికి ఉచితంగా కృత్రిమ గర్భధారణ చేయిస్తున్నాం. ఇందుకు గోపాలమిత్రలు, పశు సంవర్ధకశాఖ సాంకేతిక సిబ్బంది చురుకైన పాత్ర పోషిస్తున్నారు.
– డాక్టర్ శ్రీశైలం, డీఎల్డీఏ, కార్యనిర్వాహణాధికారి
మూగ జీవాలకు వైద్యసేవలందించడం అదృష్టంగా భావిస్తున్నాం. రైతులకు అందుబాటులో ఉండి ఎదుకు రాని పాడిపశువులకు కృత్రిమ గర్భధారణ చేస్తున్నాం. దీంతో మేలు జాతి దూడలు జన్మించి పాడి రైతులకు లాభాన్ని చేకూరుస్తుంది. అంతేగాకుండా పాడి పశువులకు గర్భకోశ వ్యాధులు రాకుండా ఉంటుది. గోపాలమిత్రల సేవలను గుర్తించి ప్రతినెలా గౌరవ వేతనం సక్రమంగా అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలి.
– కృష్ణాగౌడ్, గోపాలమిత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు, జాడి జమాల్పూర్ సెంటర్