సిరికొండ, జూన్ 8: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తాళ్లరామడుగు గ్రామానికి చెందిన మామిడి గొల్ల రాజన్న (57) చేపమందు కోసం వెళ్లి మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉపాధి కోసం గతంలో విదేశాలకు వెళ్లిన ఆయన తిరిగి వచ్చిన తర్వాత వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
నాలుగేండ్లుగా ఆయన ఆస్తమాతో బాధపడుతున్నారు. శనివారం హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేపమందు పంపిణీ కార్యక్రమానికి కుటుంబసభ్యులతో కలిసి వెళ్లాడు. ఉదయం 7గంటల సమయంలో క్యూలో తోపులాట జరిగింది. ఈ ఘటనలో రాజన్న తీవ్రం గా గాయపడడంతో కుటుంబ సభ్యులు అతన్ని సమీప దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య చిన్న సాయమ్మ, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. రాజన్న మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.