కోటగిరి అక్టోబర్ 14 : నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ పార్టీ చెలగాటమాడుతుందని బీఆర్ఎస్ మండల యువజన విభాగం నాయకులు గంగా ప్రసాద్ గౌడ్ ఆరోపించారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. కులగణన సర్వేలో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేసేందుకు నిరుద్యోగ యువకులను పెద్ద ఎత్తున వాడుకున్నారని ఆరోపించారు. సర్వేలో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేసేందుకు నిరుద్యోగయువకులకు ఒక్కో దరఖాస్తుకు సుమారు రూ.50 వరకు ఇస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులతో పనులు చేయించుకున్నారని, సంవత్సరం గడుస్తున్న ఇప్పటివరకు దరఖాస్తులను ఆన్లైన్ చేసిన నిరుద్యోగ యువకులకు మాత్రం డబ్బులు చెల్లించలేదని మండిపడ్డారు.
నిరుద్యోగులతో పనులు చేయించుకొని డబ్బులు చెల్లించకపోవడం ఏమిటని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటన చేసిందని రెండేళ్లయిన ఇప్పటికీ నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు యువకులకు తక్షణమే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీవో శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందించారు. ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకొని వెళ్లి తక్షణమే నిరుద్యోగుల డబ్బులను చెల్లించేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు కప్ప సంతోష్, గౌతమ్, సమీర్, తెల్ల చిన్న, అరవింద్, మహేష్ రెడ్డి, రుద్రాంగి సందీప్, యోగేష్, మామిడి వెంకటేష్, కనిగిరి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.