ఖలీల్‌వాడి, డిసెంబర్ 31: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్ అన్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత పర్యటన సందర్భంగా డీసీసీ చీఫ్ మానాల విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో పేర్కొన్న అంశాలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలుచేయకుండా ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ముందు ఆరు గ్యారెంటీలను అమలుచేయాలని, కవితపై మాట్లాడడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ 60 ఏండ్ల పాలనలో చేసిన పాపాలను తొమ్మిదేండ్లలో పది, పదిహేనుసార్లు తాము కడిగినట్లు చెప్పారు. రైతుబంధు, మిషన్ భగీరథ, కాళేశ్వరం, రైతుబీమా ఇలా 365 పథకాలను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని తెలిపారు. క్రైమ్‌రేట్ మీద చర్చకు సిద్ధమని డీసీసీ చీఫ్ సవాల్ విసురుతున్నారని, ఒకసారి డాటా తీసుకొని వస్తే తెలుస్తదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై 89 క్రిమినల్ కేసులు ఉన్నాయని, దేశంలో ఏ ముఖ్యమంత్రిపై ఇన్ని కేసులు లేవన్నారు. ఆయన పేరు మర్చిపోతే, ఆయనను నిందిస్తే, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వారిపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వసతి గృహాల్లో చనిపోతున్న పిల్లల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే సామాన్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్ నాయకులపై మాట్లాడితే ఆ పార్టీ నేతలకు నోళ్లు లేస్తున్నాయని, రైతులకు ఆన్యాయం జరిగినప్పుడు, వారిని జైల్లో పెట్టినప్పడు, విద్యార్థులు, ఆటో డ్రైవర్లు చనిపోతే ఎందుకు నోళ్లు లేస్తలేవో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం సొంత గ్రామంలో రైతులకు కరెంట్ షాకులు పెట్టి, జైల్లో బేడీలు వేసి అవమానించిన ఘటనలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. వారి కుటుంబీకుల ఆర్తనాదాలు కాంగ్రెస్ నాయకులకు ఎందుకు వినిపించడంలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు, కల్యాణలక్ష్మి పథకాలను మరిచిపోలేకపోతున్నారన్నారు.
కాంగ్రెస్‌కు రాక రాక అధికారం వచ్చిందని, బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ప్రజాపాలన ప్రజా దరఖాస్తులు, రిజర్వేషన్లు ఎటుపోయాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల బట్టలు తాము విప్పబోమని, ప్రజలే విప్పుతారన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్ నాయకులు ఎన్నో తిట్లు తిట్టారని, ఏనాడైనా వారిని జైల్లో పెట్టామా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు రౌడీలను పెంచి పోషించి, నాయకులుగా ప్రజలపైకి పంపిస్తున్నారని విమర్శించారు. ఇక వారి ఆటలు సాగవని హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవిత సభలో మాట్లాడుతుంటే లేడి సింహం వచ్చినట్లు అనిపించిందన్నారు. ఆమెకు జిల్లా ప్రజలు బ్రహ్మరథం పడితే కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్పరాజు, నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాశ్, సాంబారి మోహన్, తెలంగాణ శంకర్ తదితరులు పాల్గొన్నారు.