Rythu Bima | రైతుబీమా అన్నదాతల కుటుంబాల్లో భరోసా నింపుతున్నది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు ‘రైతుబీమా’ ద్వారా.. ఆపదలోనూ భరోసానిస్తున్నది. రైతు ఏ కారణంతోనైనా మృతి చెందితే రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తూ వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నది. 2018లో ప్రవేశపెట్టిన రైతుబీమా పథకంలో భాగంగా ఇప్పటివరకు కామారెడ్డి జిల్లాలో 5,178 మంది రైతులు మృత్యువాత పడగా.. రూ.5 లక్షల చొప్పున రూ.258.90 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించారు.
కామారెడ్డి, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభు త్వం అన్నదాతల శ్రేయస్సు కోసం విశేషంగా కృషి చేస్తున్నది. సాగు మొదలు పంట చేతికొచ్చే వరకు అండగా నిలుస్తున్నది. అదే విధంగా అన్నదాతల కుటుంబాలను ఆదుకునేందుకు రైతుబీమా పథకాన్ని అమలు చేస్తున్నది. ఆపదలో ఈ పథకం రైతు కుటుంబానికి అండగా నిలుస్తున్నది. రైతు కుటుంబానికి ఏకంగా రూ.5లక్షల ఆర్థిక సహాయం అందడంతో ఆసరాగా నిలుస్తున్నది. రైతులు ఏ కారణంతోనైనా మరణిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడకుండా, ఆదుకొనేందుకు 2018లో ప్రవేశపెట్టిన రైతు బీమా పథకంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 5,239 మంది రైతులు మరణించగా..5,178 కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.258.90 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించడం గమనార్హం.
ఒక్క గుంట భూమి ఉన్నా..
రైతు బీమా పథకాన్ని పొందేందుకు రైతు పేర ఒక్క గుంట భూమి ఉన్నా చాలు. అతను బీమాకు అర్హుడే. బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ నిబంధనల ప్రకారం 18 నుంచి 59 ఏండ్ల వయస్సు ఉన్న రైతులు అర్హులు. రైతు బంధు పథకం వర్తిస్తున్న రైతులందరికీ రైతు బీమా వర్తిస్తుంది. ప్రభుత్వమే రైతు పేరిట ప్రీమియాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెల్లిస్తున్నది. రైతు ప్రమాదవశాత్తు మరణించినా, సహజ మరణం పొందినా ఆ కుటుంబానికి రూ.5లక్షలను చెల్లిస్తారు. రైతులకు ఎంతో ఉపయోగపడుతున్న ఈ పథకంతో ప్రభుత్వంపై వందల కోట్ల భారం పడుతున్నా, రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రీమియాన్ని చెల్లిస్తున్నది.
ఒక్క కామారెడ్డి జిల్లాలోనే 2022-23 ఆర్థిక సంవత్సరంలో 1,99,044 మంది రైతులకు సంబంధించిన రూ.79.61కోట్ల ప్రీమియాన్ని చెల్లించింది. సహజ మరణం పొందినా ఆర్థిక సహాయం అందుతుండడం తో.. బాధిత కుటుంబాలకు ఈ డబ్బులు ఎంతో ఉపకరిస్తున్నాయి. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రవేశపెడుతున్న రైతు సంక్షేమ పథకాలతో అనేక రాష్ర్టాల్లోని రైతులు తె లంగాణలో అమలవుతున్న పథకాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంక్షేమ పథకా లు తమ రాష్ట్రంలోనూ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా ఆవిర్భవించి బీఆర్ఎస్గా మారడంతో అనేక రాష్ర్టాల్లో రైతులు అబ్ కీబార్ – కిసాన్ సర్కార్ అంటూ నినాదాలు చేస్తున్నారు.
జిల్లాలో 5178 మందికి లబ్ధి
రైతుబీమా పథకం కామారెడ్డి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. రైతులు మరణిస్తే వెంటనే వ్యవసాయ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలి. సిబ్బంది వచ్చి పూర్తి వివరాలను సేకరించి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బీమా డబ్బు అందే విధంగా చర్యలు తీసుకుంటారు. రైతులకు ఈ పథకం భరోసానిస్తోంది.
-వీరస్వామి, జిల్లా వ్యవసాయ అధికారి, కామారెడ్డి
బీమా పైసలతోటి బిడ్డ లగ్గం జేశిన..
నా భర్త లక్ష్మణ్ మూడేండ్ల కింద కాలం జేసిండు. ఆయన పేరు మీద 36 గుంటల భూమి ఉంది. దీంతోటి నాకు రూ.5లక్షల బీమా పైసల్ అచ్చినయ్ . ఆ పైసల్ మస్తు ఆసరైనయ్. నాకు ఒక కొడుకు, ఇద్దరు బిడ్డలు. పెద్దబిడ్డ లగ్గం ఆయన ఉన్నప్పుడే జేసినం. చిన్నబిడ్డ లగ్గం చేయాల్సి ఉండె. బీమా పైసలకు తోడు కల్యాణలక్ష్మి పైసల్ గూడా అచ్చినయ్. దీంతోటి బిడ్డ లగ్గం జేసినం. ఇప్పుడు పాణం నిమ్మలమైంది. ఇదంతా కేసీఆర్ పుణ్యమే..
-నక్క బశవ్వ, హరిజనవాడ, బాన్సువాడ
ఇల్లు కట్టుకున్నం
నా భర్త తాళ్ల గంగారాం. బాన్సువాడ బల్దియాల పని చేస్తుండె. ఆయన పేరు మీద ఎకరం పొలం ఉంది. ఆయనకు సుస్తి జేసి కాలం జేసిండు. ఉన్న ఒక్క కొడుక్కు పక్షవాతం అచ్చింది. నా భర్త కాలం జేసినంక బీమా పైసల్ రూ.5 లచ్చలు అచ్చినయ్. ఆ సొమ్ముతోటి ఇల్లు కట్టిన.. మిగిలిన పైసల్తోటి కొడుకుకు దవాఖానల సూపిస్తున్న…స్పీకర్ సారు, కేసీఆర్ సారు ఇచ్చిన డబ్బులు ఎంతో ఆసరైనయ్.
-తాళ్ళ సాయవ్వ, హరిజనవాడ, బాన్సువాడ
ఇల్లు కట్టినం… పెండ్లి జేస్తాం..
మా నాయిన బాలయ్య పేరు మీద భూమి ఉండె. ఆయన మూడేండ్ల కింద చనిపోయిండు. రూ.5లక్షల బీమా సొమ్ము అచ్చింది. ఆ సొమ్ముతో ఇల్లు కట్టుకున్నం. భూమి మా అమ్మపేరు మీదకు మార్చిండ్రు. ఆమె కూడా పోయిన ఏడాది చనిపో యింది. ఆమె పేరు మీద కూడా రూ.5లక్షలు వస్తయట. మాకు బీమా సొమ్ము ఎంతో ఉపయోగపడింది. ఆ సొమ్ముతో కోడలు పెండ్లి జేస్తున్నం.బీమా సొమ్ముతోటి కష్టాలన్నీ తీరినై.
-చాకలి భాగవ్వ, సంగమేశ్వర కాలనీ, బాన్సువాడ
బాన్సువాడ సొసైటీ పరిధిలో 61 మందికి బీమా
ఒక్క బాన్సువాడ సొసైటీ పరిధిలోనే గత ఐదేండ్లలో 61 మందికి బీమా డబ్బులు అందాయి. రైతులు చనిపోతే వెంటనే వ్యవసాయ శాఖ అధికారికి తెలియజేస్తున్నాం. నెల నుంచి రెండు నెలల్లోపు డబ్బులు వస్తున్నాయి. బాన్సువాడ నియోజకవర్గంలో అసెంబ్లీ స్పీకర్ పోచారం సార్ కృషితో రైతులకు సకాలంలో బీమా డబ్బులు అందుతున్నాయి.
-ఎర్వాల కృష్ణారెడ్డి, సొసైటీ చైర్మన్, బాన్సువాడ