మోర్తాడ్, ఫిబ్రవరి 21: ఏర్గట్ల మండలంలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతున్నది. ఇసుక దోపిడీపై నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘మేమింతే…మా రూటే సెపరేటు’అనే శీర్షికన శుక్రవారం ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. ఏర్గట్ల తహసీల్దార్ శ్రీలత బట్టాపూర్ వద్ద వేబిల్లులు లేకుండా వస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు.
ట్రాక్టర్లకు సిబ్బందిని కాపలాగా ఉంచారు. కానీ సిబ్బంది కళ్లుగప్పి ట్రాక్టర్లతో డ్రైవర్లు పరారయ్యారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను మండల మెజిస్ట్రేట్ పట్టుకున్నా పరారయ్యారంటే మండలస్థాయి అధికారుల పరిస్థితి ఏమిటో అర్థమవుతున్నది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రేపు అధికారులపై దాడులు కూడా చేస్తారేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.