కామారెడ్డి, డిసెంబర్ 6: తప్పులు లేకుండా ఓటరు జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్‌తో కలిసి ఎన్నికల అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం చేపడుతున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో మార్పులు, చేర్పులు, సవరణలు, ఫొటో మార్పు వంటివి సరిచేసుకోవచ్చని సూచించారు.
ఓటరు జాబితాను పారదర్శకంగా తయారు చేయడానికి ఇది ఒక సువర్ణ అవకాశం అని తెలిపారు. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికీ తిరుగుతూ ఓటరు జాబితాను పరిశీలించాలన్నారు. ఒకే కుటుంబంలోని వ్యక్తుల ఓట్లు అన్ని ఒకే పోలింగ్ స్టేషన్లో ఉండేలా చూడాలన్నారు. గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో అర్హులందరి పేర్లు నమోదు చేసుకునేలా చూడాలని సూచించారు.
పాల్వంచ మండలం వాడి గ్రామ పోలింగ్‌స్టేషన్ 46బూత్ లెవెల్ అధికారిణి నిమ్మల లీల సేవలు సంతృప్తిగా ఉన్నందున భారత ఎన్నికల కమిషన్ అభినందించి, ఆమె కథకాన్ని బీఎల్వో పత్రికలో ప్రచురించిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు శాలువా కప్పి సత్కరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవోలు రంగనాథ్ రావు, మన్నె ప్రభాకర్, తహసీల్దార్లు, ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.