కంఠేశ్వర్/ బోధన్, డిసెంబర్ 6 : ఓటరు జాబితా సవరణలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు మార్గదర్శకాలు పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సూచించారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన కలెక్టర్ రాజీవ్‌గాంధీతో కలిసి నగరంలోని ఆర్డీవో ఆఫీస్‌తోపాటు బోధన్ సబ్‌కలెక్టర్ కార్యాలయంలో కొనసాగుతున్న ఈఆర్వో ఆఫీస్‌లను శుక్రవారం సందర్శించారు. నోటీసు బోర్డులపై అతికించిన ముసాయిదా ఓటరు జాబితాలను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు.
ఓటరు జాబితాలో పేర్ల నమోదు చిరునామాల మార్పు, పేర్ల తొలగింపు తదితర వాటికి సంబంధించిన దరఖాస్తుల పరిష్కారంలో మార్గదర్శకాలు పాటించారా లేదా అని రికార్డులను పరిశీలించి నిర్ధారణ చేసుకున్నారు. ఉపాధ్యాయ, పట్టుభద్రుల శాసనమండలి ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాలో పేర్ల నమోదు కోసం ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఈఆర్వోలకు కీలక సూచనలు చేశారు.
అనంతరం వినాయక్‌నగర్‌లోని ఈవీఎం గోడౌన్‌ను సందర్శించి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో బీయూలు, సీయూలు , వీవీ ప్యాట్ల భద్రత ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలన జరిపారు. అర్బన్, రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ సహాయ రిటర్నింగ్ అధికారులతో సీఈవో సమీక్ష నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అమలులో జిల్లా యం త్రాంగం పని తీరు అభినందనీయమని పేర్కొన్నారు.