వినాయక్‌నగర్, అక్టోబర్28: దివ్యాంగుల సమస్యల పరిష్కారంలో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ వారికి అండగా ఉంటుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్పర్సన్ జీవీఎన్. భరత లక్ష్మి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రత్యేక అవసరాలుఉన్న పిల్లల కేంద్రంలోని దివ్యాంగుల తల్లిదండ్రులు వారి పిల్లలతో న్యాయసేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావుతో కలిసి జిల్లా ప్రధాన న్యాయమూర్తిని మంగళవారం కలిశారు.
పుట్టుకతోనే మానసిక, శారీరక రుగ్మతలతో పిల్లలు బాధపడుతున్నారని తమ ఆవేదన వెలిబుచ్చారు. అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నట్లు తెలిపారు. ప్రత్యేక అవసరాలుగల పిల్లల కేంద్రంలో నెలకొన్న సమస్యలు, దివ్యాంగుల గుర్తింపులో ఎదురవుతున్న ఇబ్బందులు, విద్యను అభ్యసించడంలో విద్యా సంబంధిత ధ్రువపత్రాలు, దివ్యాంగుల పెన్షన్ తదితర సమస్యలను ప్రధాన న్యాయమూర్తి తెలుసుకున్నారు. కలెక్టర్‌తో మాట్లాడి సమస్యలు పరిష్కరించే విధంగా చూస్తామని భరోసా ఇచ్చారు.