కంఠేశ్వర్/ నందిపేట్, ఏప్రిల్ 22: జిల్లాలోని ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్ నిలిచే ప్రాంతాలను ఎకో టూరిజం స్పాట్లుగా తీర్చిదిద్దుతామని ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్ నిలిచే మండలంలోని ఉమ్మెడ, జలాల్పూర్ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించేందుకు ఎకో టూరిజం డైరెక్టర్ రంజిత్ నాయక్‌తో కలిసి ఆయన మంగళవారం జిల్లా పర్యటనకు వచ్చారు.
ముందుగా జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయంలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతుతో కలిసి అటవీ, రెవెన్యూ, నీటిపారుదల తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమగ్ర వివరాలతో నివేదికలను సమర్పిస్తే తక్షణమే మంజూరు చేసి నిధులు కేటాయిస్తామన్నారు.
నందిపేట్ ఎకో టూరిజం అభివృద్ధి పనుల్లో భాగంగా సఫారీ వాహనాల కొనుగోలు, వాచ్ టవర్, పార్కింగ్ ప్రదేశం, రెస్టారెంట్లను మొదటగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. ఉమ్మెడ నుంచి బాసర వరకు బోటింగ్ సౌకర్యం కల్పించడానికి ప్రణాళికను కూడా సిద్ధం చేస్తామన్నారు. సమీక్షలో జిల్లా అటవీశాఖ అధికారి వికాస్‌మీనా, ఆర్డీవో రాజాగౌడ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.