పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించడంలో ఆయనది అందెవేసిన చేయి. పిల్లల సృజనాత్మకత, నైపుణ్యాలను గుర్తించడంలో ఆరితేరిన శిల్పి. బడులను సాహితీవనాలుగా తీర్చిదిద్ది.. కవితా కుసుమాలు పూయిస్తూ ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెస్తున్నాడు. నిజామాబాద్ రూరల్ మండలం గుండారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న డాక్టర్ కాసర్ల నరేశ్‌రావు.. కవిగా రాణిస్తూ ఎన్నో అవార్డులు, పురస్కారాలు సొంతం చేసుకున్నారు.
-నిజామాబాద్ రూరల్, ఏప్రిల్ 21
గుండారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాసర్ల నరేశ్‌రావు ఏడున్నర సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. తెలుగు ఉపాధ్యాయుడిగా సేవలందిస్తూనే విద్యార్థులను సాహితీ రంగంలో ప్రోత్సహిస్తున్నారు. బాల కవులుగా తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థుల సృజన ప్రయాణం వెనుక నరేశ్‌రావు నిరంతర కృషి దాగి ఉన్నది. 2018లో విద్యార్థులతో ‘గుండారం గువ్వలు’ అనే కవితా సంపుటిని రచింపజేశారు. పిల్లలకు పద్యాలు నేర్పుతూ, ప్రతి శనివారం పద్యధారణ పోటీలు నిర్వహిస్తున్నారు. 2019లో నిర్వహించిన ‘పద్య అంత్యాక్షరి’లో ఈయన వద్ద శిక్షణ పొందిన విద్యార్థులు సాహితీ పెద్దల ప్రశంసలను అందుకున్నారు. ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం రాష్ట్రస్థాయిలో మొదటిసారి కావడం గమనార్హం.రాష్ట్రస్థాయిలో పత్తిపాక, గరిపెల్లి ట్రస్ట్ వారు నిర్వహించిన సైన్స్‌ఫిక్షన్ కథల పోటీల్లో గుండారం పాఠశాల విద్యార్థి డి.నవీన్ ప్రోత్సాహక బహుమతిని అందుకున్నాడు.
నరేశ్‌రావు 25 ఏండ్లుగా సాహితీ రంగంలో సేవలందిస్తున్నారు. కవి, రచయితగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక సన్మానాలు, సత్కారాలు అందుకున్నారు. కవిగా ‘పది’ పుస్తకాలను రచించిన కాసర్ల.. కరోనా కాలంలో ‘కట్టడి’ అనే కవితా సంపుటిని తీసుకువచ్చారు. దీనికి 2020లో అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రత్యేకంగా ప్రశంసిస్తూ అభినందన పత్రాన్ని పంపారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో నరేశ్‌రావు రచించిన ‘కాగడా’ పుస్తకం నిజామాబాద్ జిల్లాకు మంచి ఉద్యమకీర్తిని తెచ్చి పెట్టింది.2022 జూలైలో సింగపూర్ కేంద్రంగా నిర్వహించిన ‘అంతర్జాతీయ కవి సమ్మేళనం’లో తన కవితలను వినిపించి విమర్శలకుల అభినందనలు అందుకున్నారు. సాహితీ సంస్థలతో కవనకిరీటి బిరుదును అందుకున్న కాసర్ల.. కవిగా, రచయితగా, వ్యాఖ్యాతగా, వక్తగా, సాహితీ పరిశోధకుడిగా, విమర్శకుడిగా ముందుకు సాగుతున్నాయి. తాను రచించిన బాలనాటికలను విద్యార్థులతో ప్రదర్శింపజేస్తారు. 2018లో విద్యాశాఖ జిల్లాస్థాయిలో నిర్వహించిన నాటికల పోటీల్లో గుండారం విద్యార్థులు ‘తనదాకవస్తే’ అనే నాటికను ప్రదర్శించి రెండో బహుమతిని గెలుచుకున్నారు. కరోనా సమయంలో ఆన్లైన్లో పాఠాలు బోధిస్తూనే పిల్లలతో కవితలు రాయించి ముద్రణ కోసం వివిధ పత్రికలకు పంపించారు. నిజామాబాద్ ఎఫ్ఎం ఆకాశవాణి ఆధ్వర్యంలో నిర్వహించే ‘బాలభారతి’ కార్యక్రమంలో గుండారం విద్యార్థులు పలుమార్లు పాల్గొనడం గమనార్హం. ప్రపంచ తెలుగు మహాసభల్లో ఇదే పాఠశాల నుంచి 20 మంది విద్యార్థులు ‘జిల్లాస్థాయి బాల కవిసమ్మేళనం’లో పాల్గొన్నారు. కవితా పోటీల్లో ఏ.పూజాశ్రీ అనే విద్యార్థి జిల్లాస్థాయంలో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయిలోనూ పాల్గొన్నది. ఇటీవల ఎస్సీఈఆర్టీ వారు నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్డ్రామా, జానపద నృత్య పోటీల్లో గుండారం విద్యార్థులు మొదటి స్థానం సాధించడంతోపాటు రాష్ట్రస్థాయిలోనూ ప్రదర్శన ఇచ్చారు. కాసర్ల రచించిన ‘జై విజ్ఞాన్’ అనే నాటికను ఈ విద్యార్థులు ప్రదర్శించారు.