రెంజల్, జూన్ 6: ‘ఉపాధ్యాయులు లేని పాఠశాలలో చేర్పించి మా పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకోబోం’ అంటూ బడిబాట కార్యక్రమాన్ని తల్లిదండ్రులు అడ్డుకున్నారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తిలో బడిబాటలో భాగంగా ఇంటింటికీ తిరుగుతున్న హెచ్ఎం, ఉపాధ్యాయులను తల్లిందండ్రులు వేసిన ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. వివరాలు ఇలా ఉన్నాయి. కందకుర్తి జిల్లా పరిషత్ ఉర్దూ మీడియం పాఠశాల హెచ్ఎం అబ్దుల్ కరీం, ఉపాధ్యాయులతో కలిసి బడిబాటలో ఇంటింటికీ తిరుగుతూ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు వివరించారు. స్పందించిన పిల్లల తల్లిదండ్రులు హెచ్ఎంతో వాగ్వాదానికి దిగారు. 168 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఏమూలకు సరిపోతారని ప్రశ్నించారు. ప్రభుత్వం పాఠశాలల పునఃప్రారంభం నాటికి విద్యావలంటీర్లను నియమిస్తామని ప్రకటించినా ఊసేలేదని వాదనకు దిగడంతో బడిబాట కార్యక్రమాన్ని మధ్యలోనే ఆపేసి హెచ్ఎం, ఉపాధ్యాయులు వెనుదిరిగారు. ఇదిలా ఉండగా సంసద్ ఆదర్శ గ్రామ్ యోజన కింద 2015లో గ్రామాన్ని దత్తత తీసుకున్న అప్పటి ఎంపీ కల్వకుంట్ల కవిత 6వ తరగతి వరకు ఉన్న ఉర్దూ మీడియం పాఠశాలను 10వతరగతి వరకు అప్గ్రేడ్ చేయించారు. ఉపాధ్యాయుల భర్తీ చేయించడంలో పాలకుల నిర్లక్ష్యంతో విద్యార్థులకు శాపంగా మారింది. గతేడాది ఈ పాఠశాలలో 63 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు.