బాన్సువాడ రూరల్/ వర్ని, అక్టోబర్ 7 : దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. సంక్షేమ పథకాలే సర్కారుకు అండగా నిలుస్తాయని పేర్కొన్నారు. శనివారం ఆయన బాన్సువాడ మండలం తిర్మలాపూర్ గ్రామంలో రూ. 2.53 కోట్ల అభివృద్ధి పనులను ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. వర్ని మండల కేంద్రంలోని సీసీడీలో వర్ని, చందూర్, మోస్రా, రుద్రూరు, కోటగిరి, పొతంగల్ మండలాలకు చెందిన 1434మంది లబ్ధిదారులకు గృహలక్ష్మి మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దూర దృష్టితో రూ.85వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని తెలిపారు. కాళేశ్వరం నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి తీసుకొచ్చి రెండు పంటలకు సాగు నీరు అందిస్తున్నామన్నారు. భవిష్యత్‌లో సాగు నీటికి ఎలాంటి ఢోకాలేదన్నారు.
పేదలకు విద్య, వైద్యం పూర్తిస్థాయిలో అందాలని బాన్సువాడ నియోజకవర్గంలో దవాఖానలు, గురుకుల పాఠశాలల ఏర్పాటుకు కృషి చేసినట్లు చెప్పారు. కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. తిర్మలాపూర్ గ్రామానికి పదేండ్లలో సంక్షే మ పథకాలకు రూ.16.37 కోట్లు, అభివృద్ధి పనులకు రూ.11.54 కోట్లు నిధులు ఖర్చు చేశామని వివరించారు. నిరుపేదలకు పక్కా ఇండ్లు నిర్మించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ గృహలక్ష్మి పథకం కోసం బడ్జెట్లో రూ.12వేల కోట్లు కేటాయించారని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల మంజూరు కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వ వద్దని సూచించారు. సుపరిపాలన అందిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని మరో సారి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, సర్పంచ్ జిన్నరఘురామయ్య, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు దొడ్ల నీరజారెడ్డి, పద్మాదారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ భూషణ్‌రెడ్డి, బుడ్మి సొసైటీ చైర్మన్ గంగుల గంగారాం, ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, బాన్సువాడ సొసైటీ అధ్యక్షుడు ఎర్వాల కృష్ణారెడ్డి, రైతుబంధు సమితి గ్రామ అధ్యక్షుడు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.