సిరికొండ, జనవరి 18: ఉత్తమ ఆలోచనలకు సృజనాత్మకత మమేకమైతే విద్యార్థులు జీవితంలో ఉన్నతస్థ్థాయికి చేరుకుంటారని, కష్టపడి చదువుకోవాలని ధర్పల్లి సీఐ సైదా అన్నారు. సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎస్ఎస్సీ-2022లో సిరికొండ మండల టాపర్స్‌గా నిలిచిన విద్యార్థులకు ఉత్తమ పురస్కారాలను బుధవారం అందజేశారు.
ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణను అలవర్చుకోవాలని.. పట్టుదల, అంకితభావంతో ముందుకు సాగితే అనుకున్నది సాధించవచ్చని అన్నారు. 2021-22లో 10 జీపీఏ సాధించిన సత్యశోధక్ పాఠశాల విద్యార్థులు వి.రక్షిర, జి.దీక్షిత, చీమన్‌పల్లి మహాత్మాజ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలకు చెందిన సీహెచ్. గోపిక, ఎస్.పల్లవి, సిరికొండ మాడల్ స్కూల్‌కు చెందిన పి.సౌందర్య, కె.శ్రీలతకు రావుట్ల చిన్ననర్సయ్య స్మారక నగదు పురస్కారం రూ.2 వేల చొప్పున, జ్ఞాపిక, ప్రసంసాపత్రాలను అందజేశారు.
అదేవిధంగా జాతీయ జాంబోరిలో వివిధ అంశాల్లో ప్రతిభ కనబర్చిన సత్యశోధక్ పాఠశాల విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ ఆర్.నర్సయ్య, ఏఎస్సై బాల్సింగ్, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం.బాలయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.