వినాయక్‌నగర్/కామారెడ్డి, జనవరి 3: ఖైదీలకు ఉపాధి కల్పించడం ద్వారా పునరావాసానికి వీవింగ్ యూనిట్ ఎంతో దోహదపడుతుందని రాష్ట్ర జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా అన్నారు. సోమవారం నిజామాబాద్ సెంట్రల్ జైలుతోపాటు కామారెడ్డి సబ్‌జైలును సందర్శించారు. కామారెడ్డి సబ్‌జైలులో ఖైదీల యోగక్షేమాలు, భోజన వసతులు, న్యాయసేవ, ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అధికారులతో మాట్లా డి, రికార్డులను పరిశీలించారు. సెంట్రల్ జైలులో వీవింగ్ యూనిట్(కుట్టు పరిశ్రమ)ను ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. 2021 లో నిజామాబాద్ జైలును సెంట్రల్ జైలుగా అభివృద్ధి చేసి, అప్పటినుంచి ఇక్కడ స్టీల్ ఇండస్ట్రీ యూనిట్, ముద్రణ(ప్రింటింగ్, దర్జీ విభాగంతో పాటు ఫినైల్ తయారీ విభాగాన్ని నిర్వహిస్తున్నారని వివరించారు. చర్లపల్లిలో ఉన్న వీవింగ్ యంత్రాలను నిజామాబాద్ సెంట్రల్ జైలుకు తరలించి ఇక్కడే వీవింగ్(కుట్టు పరిశ్రమ)ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక్కడ తయారు చేసిన వస్ర్తాలు వరంగల్ రేంజ్‌లోని అన్ని జైళ్లకు సరఫరా చేయడంతోపాటు ప్రజలకు సైతం విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. వరంగల్ రేంజ్ జైళ్ల శాఖ డీఐజీ ఎం.సంపత్, కామారెడ్డి ఎస్పీ, నిజామాబాద్ ఇన్చార్జి సీపీ సింధూశర్మ పాల్గొన్నారు.