నిజామాబాద్ స్పోర్ట్స్, డిసెంబర్ 29 : ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో జిల్లాలోని ఆయా సెగ్మెంట్ల నుంచి పోటీ చేసిన అభ్యర్థులందరూ ఎన్నికల సందర్భంగా చేసిన ఖర్చు వివరాలను నిర్ణీత గడువులోపు సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు సూచించారు. శుక్రవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి ఎన్నికల ఖర్చుకు సంబంధించి వివరాలను ఎన్నికల ఫలితాలు ప్రకటించబడిన 30 రోజుల్లోపు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. గడువు ముగియనున్న నేపథ్యంలో రీకన్సీలేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బ్యానర్లు, పోస్టర్, దినపత్రికలు, టీవీ చానళ్లలో ఇచ్చిన యాడ్స్, వాటికైన ఖర్చుల వివరాలు కూడా తెలియజేయాలని సూచించారు. అభ్యర్థులు వారి ఏజెంట్లకు సరైన రీతిలో ఖర్చుల వివరాలను సమర్పించేలా ఏఈవోలు మార్గనిర్దేశం చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల ఖర్చులకు సంబంధించిన వివరాలను సకాలంలో నిర్ణీత పద్ధతిలో సమర్పించని పక్షంలో అలాంటి వారికి నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. నిర్ణీత కాల వ్యవధిలోపు స్పందించని వారిపై అనర్హత విధించాలని కోరుతూ ఎలక్షన్ కమిషన్‌కు లేఖ పంపిస్తామని పేర్కొన్నారు. ఈసీ ద్వారా అనర్హులుగా ప్రకటించబడిన వారు మూడేండ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కోల్పోతారని తెలిపారు. సమావేశంలో ఎన్నికల వ్యయ పరిశీలకులు శక్తి పాటిల్ చిన్మయి ప్రభాకర్, అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, జిల్లా ఎన్నికల వ్యయ కమిటీ నోడల్ అధికారి పాపయ్య, ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన అభ్యర్థుల ఏజెంట్లు పాల్గొన్నారు.