కామారెడ్డి, మార్చి 17: కామారెడ్డి బల్దియా అవినీతికి అడ్డాగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ పైసలు ఇవ్వనిదే ఏ పని జరగదన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ ఫైల్ కదలాలన్నా, భవన నిర్మాణాలకు అనుమతులు రావాలన్నా చేయి తడపాల్సిందే. లేకపోతే ఫైల్ ముందుకు కదలదని చెబుతారు. ఈ నేపథ్యంలో బల్దియా అధికారులపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గత రెండేండ్లలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు తారాస్థాయికి చేరిన తరుణంలో ఏసీబీ దాడులు జరుగడం చర్చనీయాంశమైంది. ఇటీవల జిల్లాలో ఐటీ దాడులు జరిగిన విషయం మరువక ముందే తాజాగా మున్సిపాలిటీలో అవినీతి నిరోధక శాఖ సోదాలు మరింత కలకలం రేపాయి. అవినీతి అధికారుల్లో గుబులు మొదలైంది.
కామారెడ్డి జిల్లాగా ఏర్పాటైన అనంతరం ప్రధాన వ్యాపార కేంద్రంగా మారింది. ఈ నేపథ్యంలో భారీ వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్స్, అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి. అయితే, వాణిజ్య భవనాల నిర్మాణానికి అనుమతులు పొంద డం యజమానులకు సవాల్‌గా మారింది. రూ.లక్షల్లో ముడుపులు చెల్లిస్తేనే అనుమతులు జారీ చేస్తున్నారని పలువురు బాధితులు చెబుతున్నారు. ఇక, ఇంటి నిర్మాణాల అనుమతులు, ధ్రువీకరణ పత్రాల మంజూరుకు కూడా భారీగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏడాదికి పైగా బల్దియా పాలకవర్గం లేకపోవడం, అడిగే వారు లేరనే ధీమాతో పలువురు అధికారులు రెచ్చిపోయారని, విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడ్డారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రెండేండ్లలో కామారెడ్డి మున్సిపాలిటీలో అవినీతిపై అనేక ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే కొందరు బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో సోమవారం దాడులు జరిగాయి.
టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్ సహా పలు శాఖల్లో అవినీతిపై భారీగా ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. గత రెండేండ్లలో అనధికార నిర్మాణాలపై 47 ఫిర్యాదులతో పాటు 400లకు పైగా ట్రేడ్ లైసెన్స్‌ల రెనూవల్ పెండింగ్‌లో ఉండడం వంటివి ఏసీబీ సోదాల్లో వెలుగులోకి వచ్చాయి. ఇక, రికార్డులు సరిగా నిర్వహించక పోవడం, ఖర్చులకు సంబంధించి సరైన వివరాలు నమోదు చేయక పోవడం, అవుట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాల్లో అవకతవకలకు పాల్పడడం వంటివెన్నో తనిఖీల్లో బయట పడ్డాయని ఏసీబీ పేర్కొంది. బల్దియా అధికారుల మూలంగా భారీగా నష్టం వాటిల్లినట్లు తెలిపింది.