Dharpalli | ధర్పల్లి, ఆగస్టు 24 : జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించడంతో వారు వచ్చి కాపాడారు. ఈ ఘటన ధర్పల్లి మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ధర్పల్లి మండల కేంద్రంలోని NTR కాలనీకి చెందిన మందుల గణేష్ కుటుంబ కలహాల కారణంగా జీవితంపై విరక్తి చెంది, చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు.
ఈ విషయం 100 డయల్‌కు సమాచారం అందడంతో వెంటనే పోలీసు సిబ్బంది స్పందించారు. సమాచారం తెలుసుకున్న దర్పల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ నరేందర్ వెంటనే చెరువు వద్దకు చేరుకుని, ప్రాణాపాయ స్థితిలో చెరువులో ఉన్న గణేష్‌ను గుర్తించి, చెరువులోకి దిగి అతడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చి ప్రాణాలు కాపాడారు. కానిస్టేబుల్ నరేందర్ సమయస్ఫూర్తితో స్పందించి ఒక ప్రాణాన్ని కాపాడినందుకు పోలీసు అధికారులు ఆయనను అభినందించారు.