ధర్పల్లి/ఖలీల్‌వాడి, జనవరి 30: కాంగ్రె స్ పాలనతో రాష్ట్రంలో భయంకరమైన రోజులు వచ్చాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ దుష్పరిపాలనతో తెలంగాణ వందేళ్లు వెనక్కి వెళ్ల్లే పరిస్థితి తలెత్తిందన్నారు. అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, అబద్ధాలతో సీఎం రేవంత్‌రెడ్డి కాలం వెల్లదీస్తున్నారని విరుచుకుపడ్డారు. అబద్ధం అద్దం ముందు నిలబెడితే రేవంత్‌రెడ్డి బొమ్మ కనబడుతుందని ఎద్దేవా చేశారు. ప్రజలను మభ్యపెట్టి ఎక్కువ కాలం పాలించలేరనారు. అలవిగాని హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. గురువారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత దంపతులు.. ధర్పల్లిలో ఓ శుభకార్యానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి కవిత విలేకరులతో మాట్లాడారు.
కాంగ్రెస్ రాకతో ప్రజలు, రైతులకు మళ్లీ సమస్యలు మొదలయ్యాయని కవిత అన్నారు. యూరియా కోసం రైతులు మళ్లీ లైన్లు కట్టే పరిస్థితి వచ్చిందని గుర్తు చేశారు. కరెంట్ ఎప్పుడొస్తుందా ఎప్పుడు పోతుందా అన్నది తెలియని దుస్థితి ఏర్పడిందని, చెరువులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. జిల్లాకు నీళ్లిచ్చే కాళేశ్వరం ప్యాకేజీ 21 పనులు పూర్తి చేయని చేతగాని ప్రభుత్వం రేవంత్‌రెడ్డి ప్రభుత్వమని ధ్వజమెత్తారు.
ఆరు గ్యారంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఆరింట్లో ఏదీ సరిగ్గా అమలు చేయడం లేదని బాజిరెడ్డి మండిపడ్డారు. రేవంత్పచ్చి అబద్ధాల కోరని మండిపడ్డారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ వస్తుంది, దాంతోనే కాలం వెల్లదీస్తారని, ఇక ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేది ఎప్పుడని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఒత్తిడి వల్లే రైతు భరోసా, రుణమాఫీ అంత మాత్రమైనా వచ్చిందన్నారు. మాజీ ఎంపీపీ నల్ల సారికా హన్మంత్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, నాయకులు రాజ్‌పాల్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, రమేశ్‌గౌడ్, లింగం పాల్గొన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసీ తెలియక హామీలిచ్చామని స్వయంగా అసెంబ్లీ స్పీకర్ అన్నారని గుర్తు చేసిన ఎమ్మెల్సీ కవిత.. 130 ఏండ్ల చరిత్ర ఉందని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఎలా మోసం చేస్తుందని ప్రశ్నించారు. చేతిలో ఎర్రబుక్ పట్టుకుని దేశమంతా తిరిగే రాహుల్‌గాంధీ తెలంగాణ స్థితిగతులపై ఎందుకు మాట్లాడడం లేదని సూటిగా నిలదీశారు. గతంలో తెలంగాణను ఆంధ్రలో కలిసి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా అదే ఒరవడిని కొనసాగిస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ చరిత్ర మొత్తం మోసాల చరిత్ర, దగా చరిత్ర అని విరుచుకుపడ్డారు.
ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అనేక హామీలు ఇచ్చారని, గద్దెనెక్కాక వాటిని పక్కన బెట్టారని మండిపడ్డారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేయడం లేదని ఎండగట్టారు. పెన్షన్ మొత్తాన్ని పెంచకుండా కాంగ్రెస్ప్రభుత్వం మోసం చేసిందని, కేసీఆర్ హయాంలో ఇచ్చిన పెన్షన్లే ఇంకా ఇస్తున్నారని పెన్షన్ మొత్తాన్ని పెంచటంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారని వివరించారు. 18 ఏండ్లు నిండిన మహిళలందరికీ రూ. 2,500 ఇస్తామన్నారని, అది ఎప్పటి నుంచి ప్రారంభిస్తారని నిలదీశారు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పారని, అవి ఎటుపోయాయని ప్రశ్నించారు.
ఎల్లారెడ్డి పాఠశాలలో విషహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురికావడం బాధాకరమని కవిత అన్నారు. కేసీఆర్ పెట్టిన గురుకులాలను కూడా నడప డం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదని విమర్శించారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ప్రభుత్వం తక్షణమే మొద్ద నిద్ర వీడి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇటీవల ధర్పల్లి మండలంలో రైతుభరోసా అందించింది పది శాతం మందికేనని, కానీ కేసీఆర్ 80 శాతం మంది రైతులకు రైతుబంధు అందించారన్నారు. పసుపు పం ట మార్కెట్‌కు వస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని కవిత కోరారు. ఈ మేరకు ఎంపీ అర్వింద్ చొరవ తీసుకోవాలని సూచించారు.
అమలు కానీ హామీలు ఇచ్చి మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడుతున్నారని కవిత తెలిపారు. ఇటీవల గ్రామసభల్లో ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారన్నారు. రైతు భరోసా, రేషన్ కార్డులు ఎవరికిస్తున్నారో అర్థం కానీ పరిస్థితి ఏర్పడిందన్నారు. సచివాలయంలో ఏసీ గదుల్లో కూర్చుని తయారుచేసిన లబ్ధిదారుల జాబితాను గ్రామాల్లోకి వెళ్లి చదువుతున్నారని మండిపడ్డారు. ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు అధికారులను నిలదీస్తే అది తుది జాబితా కాదని మాట మారుస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇండ్లు, రైతుభరోసా, రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచనతో ఉందన్నారు. తాము చెప్పిన వాళ్లకే పథకాలు వస్తాయని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రకటనలు చేస్తున్నారన్నారు. గతంలో కేసీఆర్ అర్హులందరికీ పారదర్శకంగా పథకాలను అందించారని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన వాటినే అటూ ఇటూ మార్చి కాంగ్రెస్ప్రభుత్వం అమలు చేస్తున్నదని కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదేమి లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరు చేసిన పనులను తామే చేశామని చెప్పడమే తప్ప రేవంత్ ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదని విమర్శించారు.