ఖలీల్వాడి : ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేయకుండా ఉద్యోగ నియామకాలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ ( MRPS ) ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు సోమవారం ఆరవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్( Kanaka Pramode ) మాదిగ మాట్లాడుతూ దీక్షలకు జామతే ఇస్లాం, ఎంబిటీ ముస్లిం సంఘాలు సంఘీభావం తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం పీఠం ఎక్కిందే మాదిగలను మోసం చేయడానికే అన్నట్లు ఉందని ఆరోపించారు. సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తునే మరో వైపు డీఎస్సీ ఫలితాలు విడుదల చేయడం దారుణమని ఆరోపించారు. వర్గీకరణ బిల్లును ప్రవేశ పెడుతామని రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. మాదిగ సమాజాన్ని మోసం చేస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.
ఈ దీక్షలో జిల్లా ఉపాధ్యక్షులు రొడ్డ ప్రవీణ్ మాదిగ, ఎంఎంఎస్ జాతీయ నాయకురాలు యమున, సత్తెక్క, జిల్లా నాయకురాలు స్వప్న మాదిగ, ఎమ్మార్పీఎస్ టౌన్ అధ్యక్షులు మహేష్ మాదిగ, సీనియర్ నాయకులు శేఖర్ మాదిగ, విక్రమ్ మాదిగ, వినీత్ మాదిగ, జమాతే ఇస్లాం నాయకులు హుస్సేన్, మాజీ కార్పొరేటర్ ఎంఏ ముఖీత్, ఎంబీటి జిల్లా సెక్రటరీ షేఖ్ అమ్జిద్, సామాజిక కార్యకర్త వసి అహ్మద్, జహీరుద్ధిన్ తదితరులు పాల్గొన్నారు.