Helicopter | కంటేశ్వర్, ఏప్రిల్ 21 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గిరిరాజ్ కాలేజ్ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు మహోత్సవ ప్రారంభ వేడుకలలో పెను ప్రమాదం తప్పింది. ప్రారంభ వేడుకలను అట్టహాసంగా ప్రారంభించ తలపెట్టిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏర్పాట్లలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు.
వేడుకల ప్రారంభానికి తెలంగాణ రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాదు నుండి హెలికాప్టర్ లో వచ్చారు. కాగా హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో పెను ప్రమాదం సంభవించింది. హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో గిరిరాజ్ కళాశాల మైదానంలో భారీ మొత్తంలో దుమ్ము లేస్తూ రైతు మహాసభ వేడుకల కోసం ఏర్పాటు చేసిన స్వాగత తోరణం కూలి పడిపోవడంతో తీవ గందరగోళం నెలకొంది. కొద్దిసేపు పాటు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీశారు.
దుమ్ము, గాలి తాకిడికి స్వాగత తోరణం తో పాటు మహోత్సవ వేడుకల్లో ఏర్పాటు చేసిన కొన్ని స్టాళ్లు సైతం ధ్వంసమయ్యాయి. రైతు మహోత్సవ వేడుకలకు ముగ్గురు మంత్రులు వస్తున్నారనే సమాచారం ముందుగానే అధికారులకు తెలిసినా ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని పలువురు మండిపడుతున్నారు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని అధికారులను రైతులు ప్రశ్నించారు. రైతు మహోత్సవ వేడుకకు కొద్దిపాటి దూరంలోని ఐడిఓసి ప్రాంగణంలో మూడు హెలిపాడ్లు ఉన్నప్పటికీ హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ చేయకుండా వేడుక పక్కన ఎందుకు ల్యాండ్ చేశారో అధికారులకే తెలియాలని పలువురు విమర్శించడం గమనార్హం.