లింగంపేట, సెప్టెంబర్ 27: లింగంపేట మండలాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని కామారెడ్డి కలెక్టర్ అశీష్ సంగ్వాన్ అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలోని నాగన్న బావి వద్ద నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతో నాగన్న బావిని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. పూర్వవైభవం సంతరించుకున్న నాగన్న బావి.. లింగంపేటకు వన్నె తీసుకువచ్చిందన్నారు.
నాగన్న బావితోపాటు రామాలయం, నగరేశ్వర ఆలయాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగిందని, ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. నాగన్న బావి అభివృద్ధి చేసే బాధ్యతలను స్వయం సహాయక సంఘాల వారికి అప్పగించినట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. అంతకుముందు స్వయం సహాయక సంఘ మహిళలు ఏర్పాటు చేసిన ఫుడ్స్టాల్ను కలెక్టర్ సందర్శించారు.